ప్రజాశక్తి – నంద్యాల అర్బన్ : గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ , యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో 8వ సారి జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ , బొమ్మల సత్రం నందు శ్రీకాంత్ రెడ్డి , ఆన్సర్ అహ్మద్ , సుబ్బన్న, మస్తాన్ వలి, హుస్సేన్ , డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్స్ శశికళ , 36 వ వార్డు టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు ముఖ్యఅతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పాల్గొని జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 5 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని దాదాపు 230 కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. నిరుద్యోగులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ప్రతి నెల జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ ఆశయమన్నారు . ఈ ఆశయానికి అనుగుణంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు సారథ్యంలో ఖచ్చితంగా సాధిస్తామని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. అలాగే నాకు తెలిసిన హైదరాబాద్ కంపెనీస్ కూడా నంద్యాలకు తీసుకుని వచ్చి జాబ్ మేళా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు . అలాగే గత 7 సార్లు నిర్వహించిన జాబ్ మేళాలో 27 కంపెనీలు 1286 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అందులో 542 మంది ఉద్యోగాలు పొందారని తెలియజేశారు.
