ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పైరులో ఎండాకు తెగులు సోకింది. వానకాలం పంటలో సాధారణంగా వరి పైరుకు చీడపీడలు ఆశించడంతో దిగుబడులు తగ్గి రైతులు అధికంగా నష్టపోయే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో సాధారణంగా రైతులు అత్యధికంగా వరి, మిర్చి, పత్తి మొక్కజొన్న సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుండి వర్షాలు అనుకూలించడంతో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో రైతులు వరి సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా జేజిఎల్-384తో పాటు జేజిఎల్ ఇతర రకం వరి సాగు చేశారు. వరి పొలాలు పొట్ట, ఈనే దశలో ఉన్నాయి. ఈ సమయంలో తాటాకు తెగులు, పండు తెగులు సోకి వరి ఆకు చివర్లు ఎండిపోతున్నాయి. వీటిని అదుపు చేసేందుకు రైతులు మోతాదుకు మించి మందులు పిచికారి చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఈ క్రమంలో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ పలు సూచనలు చేస్తున్నారు.
దిగుబడి తగ్గే అవకాశం
కనికుట్ల సాయిబాబు, కౌలురైతు పాలపాడు, నరసరావుపేట మండలం.
వరి నాట్లు ప్రారంభం నుండి అధిక వర్షాల వల్ల పైరు అంతంతమాత్రంగానే దుబ్బు కట్టింది. ఇప్పుడు పైరు పొట్ట, ఈనే దశలో ఉండగా తాటాకు తెగులు సోకింది. ఎన్ని మందులేసినా అదుపులోకి రాలేదు. దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి.