అంగన్వాడీ,ఆశాలకు ఎన్నికల అలవెన్సులు ఏవీ?

May 15,2024 22:04

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా విధుల్లో పాల్గొన్న హెల్త్‌ సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అలవెన్స్‌ లభించలేదు. ఉదయం మాక్‌పోల్‌నుంచి పోలింగ్‌పూర్తయిన అర్ధరాత్రి వరకూ విధులు నిర్వహించిన వీరికి ఉత్తిచేయే చూపించారు.పోలింగ్‌కు ముందే అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు ఐసిడిఎస్‌ పీడీిని కలిసి అధికారికంగా డ్యూటీలు వేసి వారందరికీ ఎన్నికల అలవెన్స్‌లు ఇవ్వాలని ముందుగానే కోరారు. కానీ అధికారులు అధికారికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఫోన్‌సమాచారం ద్వారా పోలింగ్‌ విధులు నిర్వహించాలని ఆశ, అంగన్వాడీ వర్కర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో విజయనగరం జిల్లాలోని 4400మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, 1785 మంది ఆశావర్కర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 3160 మంది అంగన్వాడీలు, 1470 మంది ఆశావర్కర్లు 1530 మంది సిహెచ్‌ డబ్బ్యులు విధులు నిర్వహించారు. అంగన్‌వాడీలకు అధికారంగానే డ్యూటీలు వేశారు. వీరంతా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆశా వర్కర్లకు, అర్బన్‌ పిహెచ్‌సిల్లో పని చేసే సెకండ్‌ ఎఎన్‌ఎంలకు డ్యూటీలు వేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన మాక్‌ పోలింగ్‌ నుండి సాధారణ పోలింగ్‌ పూర్తయిన అర్ధరాత్రి వరకూ కేంద్రాల వద్ద హెల్త్‌ సిబ్బందితో కలిసి విధులు నిర్వర్తించారు. ఇతర సిబ్బంది అందరికీ అలవెన్స్‌ అందిస్తున్న అధికారులు ఆశాలకు, అంగన్వాడీలకు మాత్రం మొండిచేయి చూపారు. ఉదయం నుంచి రాత్రి వరకూ సేవలందించిన తమకు అలవెన్స్‌ ఎగ్గొట్టడం దారుణమని వారంతా ఆవేదన చెందుతున్నారు. చాలా పోలింగ్‌ కేంద్రాల వద్ద వద్ధులు, మహిళలు ఎండ వేడిమి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. వారికి ఆశాలు ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కలిపి అందజేశారు. చంటి పిల్లలతో వచ్చిన ఓటర్లు ఓటు వేసి వచ్చినంత వరకు అంగన్వాడీలు ఆ పిల్లల ఆలనా పాలనా చూశారు. భోగాపురం, గుర్ల, కొత్తవలస, రాజాం, వీరఘట్టం, భోగాపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ జరిగింది. అప్పటివరకూ వీరంతా ఇవిఎంలతో సిబ్బంది బస్సులో బయల్దేరి వరకూ అక్కడే విధులు నిర్వర్తించారు. కానీ వీరి సేవలను అధికారులు గుర్తించలేదు. 2019 ఎన్నికల్లో ఆశాలకు కూడా పోలింగ్‌ డ్యూటీ వేసి అలవెన్స్‌ అందించారు. ఈసారి ఎన్నికల్లో డ్యూటీ చేసిన వారికి పారితోషికం ఇవ్వకపోవడాన్ని అంగన్వాడీ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి ఖండించారు. నేరుగా డ్యూటీ వేయకుండా మెడికల్‌ క్యాంపు పేరుతో పోలింగ్‌ పూర్తయ్యే వరకూ డ్యూటీ చేయించి అలవెన్సు ఇవ్వకపోవడం అన్యాయమని, వారందరికీ వెంటనే అలవెన్సు చెల్లించాలని అధికారులను కోరారు.

➡️