పెట్టుబడి సాయం, మద్దతు ధరలేవీ?

Dec 14,2024 00:00

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి, పల్నాడు జిల్లా: రైతులను ఆదుకోవడంతో టిడిపి కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసిపి నేతలు విమర్శించారు. ఈ మేరకు గుంటూరు, పల్నాడు కలెక్టరేట్ల వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నాలు చేపట్టారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం గుంటూరు రోడ్‌లోని వైసిపి కార్యాలయం వద్ద నుండి లింగంగుంట్లలోని వైసిపి జిల్లా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గుంటూరులో డిఆర్‌ఒకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వైసిపి గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలు లభించడం లేదని, టిడిపి అధికారంలోకి రాగానే మిర్చి ధరలు తగ్గాయని విమర్శించారు. ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మడం వల్ల రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా నష్టపోతున్నారని చెప్పారు. పత్తి, మిర్చి పరిస్థితితకూడా ఇంతేనన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తామని తొలి సంతకం చేసినా ఇంకా ఇవ్వలేదన్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారని అన్నారు. సూపర్‌-6 పథకాలను అమలు చేయాలని, పంటలకు మద్దతు ధరలతోపాటు తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనాలని, ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని కోరారు. వైన్స్‌, మైన్స్‌, రేషన్‌ బియ్యంలో వాటాల కోసం ఒకవైపు టిడిపి నాయకులు, కార్యకర్తలు కొట్లాడుకుంటుంటే వారి పంచాయితీలు తీర్చడానికే సిఎం, డిప్యూటీ సిఎంకు సరిపోతుందని ఎద్దేవ చేశారు. సచివాలయ వ్యవస్థను, రైతుభరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వలసలు వెళ్లిన రైతు రైతులు కూడా తమ గ్రామాలకు వచ్చి పంటలు పండించుకునే పరిస్థితిని కల్పించిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలు, పంటలకు మద్దతు ధర అందించిందని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం పూర్తిగా వదిలేసి, సోషల్‌ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసే పని పెట్టుకుందని మండిపడ్డారు. టిడిపి నాయకులే దళారుల అవతారమెత్తి ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారని ఆరోపించారు. ధర్నాల్లో ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, డిప్యూటీ మేయర్‌ డైమండ్‌ బాబు, మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్‌, కాసు మహేష్‌ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకర్రావు, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీ, నూరిఫాతిమా, బాలసాని కిరణ్‌, దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు.

➡️