ఇక ఎయిడెడ్‌ వంతు

Apr 25,2025 21:34

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడు ఎయిడెడ్‌ పాఠశాలలు మూత 

40 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే మూసేయాలని ఆదేశం

ఇబ్బంది పడనున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలంటున్న తల్లిదండ్రులు

ప్రజాశక్తి- భోగాపురం : 40 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూతబడనున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు విద్యాశాఖ అధికారులు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఏడు ఎయిడెడ్‌ పాఠశాలలు మూతబడనున్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40మంది లోపే ఉన్నారు. ఈ పాఠశాలలు మూతబడితే ఒకటవ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని మూసివేస్తున్న పాఠశాలల స్థానంలో ప్రభుత్వ పాఠశాలలను మంజూరు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కాని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 40 మంది విద్యార్థుల లోపు ఉంటే ఆ పాఠశాలలను మూసి వేయాలంటూ గత ప్రభుత్వం హయాంలో జీవో నెం.24 ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. అంతేకాక విద్యార్ధులు సంఖ్య తక్కువగా ఉంటే పెంచుకోవాలని కూడా సూచించింది. కాని జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 40మంది కంటే తక్కువ విద్యార్ధులున్న పాఠశాలలు ఏడు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఈ మేరకు వీటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏకంగా మూసి వేయాలని నిర్ణయించారు. భోగాపురం మండలంలోని చెరుకుపల్లి, బొబ్బిలి మండలంలోని అలజంగి, మెరకముడిదాం మండలంలోని గర్భాం, నెల్లిమర్ల, రామభద్రపురం మండలంలోని ఆరికతోట, వంగర మండలంలోని మగ్గూరు, విజయనగరం పట్టణంలో ఎమ్‌.జి రోడ్డులో ఉగల యూపిఎస్‌ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మూతబడనున్నాయి. పక్క గ్రామాల్లో పాఠశాలలకు వెళ్ళాల్సిందేప్రస్తుతం మూడబడుతున్న ఈ పాఠశాలల్లోని విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రక్క గ్రామాల్లో గల పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటవ తరగతి నుంచి ఐదు తరగతి చదువున్న విద్యార్ధులంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఎత్తివేస్తున్న పాఠశాలల స్థానంలో ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు భోగాపురం మండలంలోని చెరుకుపల్లి పాఠశాలలో సుమారు 22 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం వీరంతా వేరే గ్రామంలోని పాఠశాలకు వెళ్ళాలంటే సుమారు 3కిలో మీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించి ఎత్తివేసిన పాఠశాలల స్థానంలో ప్రభుత్వ పాఠశాలను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

ఆదేశాలు వచ్చాయి

40 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూసివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనిలో భాగంగా చెరుకుపల్లి పాఠశాల మూతబడనుంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు వేరే పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలి.

– బి. చంద్రమౌళి, ఎంఇఒ, భోగాపురం

➡️