మాచర్ల, పెదకూరపాడులో ఇండియా అభ్యర్థుల నామినేషన్‌

Apr 21,2024 00:16

ప్రజాశక్తి – మాచర్ల :సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీకి పోటి చేస్తున్న ఇండియా వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టరు యరమల రామచంద్రారెడ్డి శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన స్వగృహం నుండి కుటుంబ సమేతంగా తహశీల్ధార్‌ కార్యాలయంలోని ఆర్‌ఓ కార్యాలయానికి చేరుకున్నారు. రామచంద్రారెడ్డి తన భార్య క్రిష్ణవేణి, కుమారుడుతో కలిసి రిటర్నింగ్‌ అధికారి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగినట్లు చెప్పారు. తమ కూటమి ఇచ్చిన 9 గ్యారెంటీలతో అభివృద్ధి, సంక్షేమం వేగవంతంగా జరుగుతాయన్నారు. డాక్టరు రామచంద్రారెడ్డి భార్య క్రిష్ణవేణి కూడ కాంగ్రెస్‌ పార్టీ తరుపున నామినేషన్‌ దాఖలు చేశారు.
శనివారం 3 నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్‌ అధికారి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున డాక్టరు యరమల రామచంద్రారెడ్డి, యరమల క్రిష్ణవేణి, ఇండిపెండెంట్‌గా డేగల సైదా రాజులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఆర్‌ఓ కార్యాలయం సమీపంలో బందోబస్తును కోనసాగించారు.

ప్రజాశక్తి – పెదకూరపాడు : పెదకూరపాడు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పమిడి నాగేశ్వరరావు శనివారం నామినేషన్‌ వేశారు. వైసిపి అభ్యర్థి నంబూరు శంకరరావు భార్య వీర వసంతకుమారి, కుమారుడు నంబూరు కళ్యాణ్‌ చక్రవర్తి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. వారి ఇరువురి తరపున వారి ప్రతినిధులు పత్రాలను ఆర్వో శ్రీరాములుకు అందించారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి అంకమ్మరావు మరో సెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మూడవరోజైన శనివారం ఒక్క నామినేషన్‌ దాఖలైంది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి జై భీమ్‌ రావ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థిగా జొన్నలగడ్డ విజరుకుమార్‌ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి.మురళీకృష్ణకు అందించారు. తొలుత ఆయన స్థానిక ఆ పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చారు. తాలూకా సెంటర్లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేశారు. అక్కడి నుండి గడియారపు స్తంభం ఎన్జీవో సెంటర్‌ మీదుగా 8వ వార్డులోని అంబేద్కర్‌ విగ్రహం వద్దకెళ్లి పూలమాలలు వేశారు. అనంతరం తహసిల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్‌ను దాఖలు చేశారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : గురజాల అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి స్వంతంత్ర అభ్యర్థిగా కోయ రామారావు రెండు సెట్ల నామినేషన్లును శనివారం దాఖలు చేసినట్లు గురజాల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జి.వి రమణకాంత్‌రెడ్డి తెలిపారు.

➡️