అపరాల కొనుగోలులో రైతుకు అన్యాయం
పంట మొత్తం దాళారులకే
ప్రజాశక్తి – జామి : అపరాలు పంట కొనుగోలు విషయంలో అన్నదాతకు అన్యాయం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారుగా నెలరోజులు దాటిపోతున్నా, జిల్లాలో ఒక్క గింజను కూడా అధికారులు కొనుగోలు చేయలేదు. ఫలితంగా అపరాలు అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రయివేటు వ్యాపారులు పంటను కారు చౌకగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన సాగుగా ఉన్న వరి పంట తర్వాత ప్రతి రైతు ఆపలరాల పంటలైన పెసర, మినుములు, ఉలవల పంటలను పండిస్తారు. అందులో భాగంగానే ఏటా జిల్లాలో సుమారుగా 37వేల ఎకరాల్లో అపరాలు సాగవుతాయి. ఇందులో కొంత భాగాన్ని రైతులు విత్తనాలకు, సొంత వినియోగానికి ఉపయోగించు కొని మిగిలిన బాగాన్ని అమ్ముకుంటారు. గత రెండు నెలల క్రితం నుంచి రైతు సంఘం అపరాలు కొనుగోలు చేసి రైతులను ఆడుకోవాలని పోరాడగా, ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు జిల్లాలో జామి (విజినిగిరి), గజపతినగరం, గంట్యాడ, సంతకవిటి, బొబ్బిలి ఇలా ఐదు చోట్ల అపరాలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ నెల రోజులైనా జిల్లాలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయ లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొమ్మనలేక పొగ అపరాల పంటలకు ప్రభుత్వం పెసర పంటకు క్వింటాకు రూ. 8,600, మినుములు క్వింటాకు రూ. 7,400 మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కొసం వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయి వంటి పలు శాఖల అధికారులను కొనుగోలు కమిటీగా పెట్టి, కొనుగోలు బాధ్యతను మార్క్‌ఫెడ్ కు అప్పగించింది. కొనుగోలు చేయాలంటే రైతు సేవా కేంద్రంలో నమోదు చేయనుకోవాలని మెలికపెట్టడంతో కొంత కాలం సైట్ ఒపెన్ కాలేదని, ఈ క్రాప్‌లో నమోదు కాలేదని రకరకాల కారణాల తో కొనుగోలు జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇన్సూరెన్స్ రాదని ఇలా లేనిపోని సాకులతో రైతులు నేరుగా దళారులను ఆశ్రయించేలా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత్యంతరం లేక కొంత మంది తక్కువ ధరకు అమ్ముకోగా, ఇప్పటికే 90శాతం రైతులు ప్రైయివేటుకు అమ్మేసినట్లు సమాచారం.
గతంలోనూ ఇదే అనుభవం..
గతంలోనూ అపరాలు కొనుగోలులో రైతులను ప్రభుత్వం మోసం చేసింది. జామి, గంట్యాడ మండలాల్లో గత సారి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి, రైతు ఉత్పత్తి సంఘాల ధ్వారా కొనిపించి, వాటిని ప్రయివేటుకు అమ్మి ధర రాలేదని మోసం చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు.
83 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు
జిల్లాలో ఇప్పటి వరకు 83 మంది రైతులు పంట అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి వద్ద 53 మెట్రిక్ టన్నులు పంట సిద్ధంగా ఉంది. అయితే ఎన్‌సిసిఎఫ్ వారు ఈ- పంట కొనడానికి వస్తున్నారు. త్వరలోనే పంట నాణ్యత ప్రమాణాల బట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
– ఎన్. వెంకటేశ్వర్రావు, మార్క్ ఫెడ్ డిఎం
తక్షణమే కొనుగోలు చేయాలి
ఇప్పటివరకు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పటికైనా తక్షణమే రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలి. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ దృష్టిలో పెట్టాం. ప్రభుత్వ మద్దతు ధర అందేలా కొనుగోలు చేస్తేనే రైతుకు మేలు.
– బుద్ధరాజు రాంబాబు, రైతు సంఘం నాయకులు