ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

Oct 1,2024 21:34

 విజయనగరంలో 153, పార్వతీపురం మన్యంలో 52 మద్యం దుకాణాలు

9 వరకు దరఖాస్తుల స్వీకరణ

11న లాటరీ లైసెన్స్‌

పరిమితి 2026 సెప్టెంబర్‌ 30వరకే

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ప్రభుత్వ మద్యం షాపులు రద్దయ్యాయి. ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటు, పెంపు, ధరలు, దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సు ఫీజులు తదితర అంశాలపై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం విజయనగరం జిల్లాలో నాలుగు దుకాణాలు పెరిగాయి. దీంతో, ఇప్పటి వరకు 149గా ఉన్న మద్యం దుకాణాల సంఖ్య 153కు చేరింది. మన్యం జిల్లాలో కొత్త, పాత కలుపుకుని 52 ఏర్పాటు కానున్నాయి. వీటికి సంబంధించి రెండు జిల్లాల్లోనూ ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలో 5చొప్పున ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. జిల్లా పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరుగా గానీ, ఆన్‌లైన్‌ పద్ధతిలోగానీ దరఖాస్తులు చేసుకోవచ్చు. 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ కూడా ఆ సమయం వరకు అందుబాటులో ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ బాబ్జీరావు స్పష్టం చేశారు. ఒక దుకాణానికి ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ నమోదు చేయాల్సి వుంటుంది. దరఖాస్తుతో పాటు రూ.2లక్షల విలువ గల డిడి లేదా చెక్కును జతపర్చాలి.నాలుగు కేటగిరీల్లో దుకాణాలు ఏర్పాటు చేయ నున్నారు. జనాభా ప్రాతిపదికన వీటిని విభజించినట్టు డిసి బాబ్జీరావు తెలిపారు. కేటగిరిని బట్టి లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి వుంటుంది. నిర్థేశించిన దుకాణం పరిధిలో 10వేల లోపు జనాభా ఉంటే లైసెన్సు ఫీజు రూ.50లక్షలు చెల్లించాల్సివుంటుంది. 10వేల నుంచి 50వేల లోపు జనాభా అయితే రూ.55లక్షలు, 50వేల నుంచి 5లక్షల లోపు జనాభా గలిగిన దుకాణానికి రూ.65లక్షలు, 5లక్షల జనాభా పైబడిన దుకాణాలకు రూ.85లక్షల చొప్పున ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు చెల్లించాల్సివుంటుంది. ఈ సొమ్మును మొత్తం ఆరు వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. ఒక ఏడాది తరువాత 10శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లైసెన్సుకు రెండేళ్ల కాలపరిమితి కూడా ప్రభుత్వం విధించింది. 2026 సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. కార్పొరేషన్‌ పరిధిలోని దుకాణాలు ఆ నగరానికి 5కిలో మీటర్లలోపు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మున్సిపాల్టీ పరిధికి 2కిలో మీటర్లలోపు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో అయితే, ఆ దుకాణం పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు.

బడి, గుడికి దూరంగా ఉండాలి : డిసి బాబ్జీరావు

మద్యం దుకాణాలను బడి, గుడి, చర్చి, మసీద్‌ తదితర ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ బాబ్జీరావు తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గెజిట్‌లో పేర్కొన్న అంశాలను వివరించారు. 30పడకల ఆసుపత్రులకు కూడా 100 మీటర్ల దూరం పాటించాలని స్పష్టం చేశారు. మండల, మున్సిపల్‌, కార్పొరేషన్‌లలో జనాభా ప్రతిపదికన దుకాణాల కేటగిరీలు, ఫీజులు ఉన్నాయని వివరించారు. గీత కార్మికులకు 10శాతం దుకాణాలు రిజర్వు విషయమై ప్రజాశక్తి ప్రశ్నించగా వారికి అదనంగా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే ప్రభుత్వం నుంచి వస్తాయని తెలిపారు.

➡️