ఆర్టీసీ బస్టాండు పరిసరాలను శుభ్రం చేసిన ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు

ప్రజాశక్తి-కడపఅర్బన్‌: నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు 200 మంది బస్టాండ్‌ పరిసరాలను శుభ్రం చేశారు. అక్కడ ఉండే 150 కిలోల ప్లాస్టిక్‌ పేపర్లు, చెత్తను సేకరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం యువ ఆధికారి సైదా నాయక్‌ విచ్చేసి ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు సేవాగుణం కలిగి ఉండాలని, సమాజం పట్ల బాధ్యతలు కలిగి ఉండాలని తెలిపారు. వారు నిర్వర్తించాల్సిన విధులను గురించి వివరించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛతను పాటించాలని సమాజంలో స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించాలన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా.ఎన్‌.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి శాఖ సహకారంతో ప్రతి ఏటా ఒక పబ్లిక్‌ ప్లేస్‌లో సామూహిక స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం ఆర్టీసీ బస్టాండ్లో చేపట్టామన్నారు. విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్న ఇతరులను భాగస్వామ్యం చేయాలన్నారు. యువత ద్వారానే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. బస్టాండ్‌ లో ఒకరోజు సామూహిక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడాన్ని ఆర్టీసీ అధికారులు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను, యన్‌ యస్‌ యస్‌ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు విజరు కుమార్‌, అనంతలక్ష్మి, కళాశాల పరిపాలన అధికారి శ్రీనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️