ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను వేగవంతంగా ప్రజలకు చేరవేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ … ప్రభుత్వ ప్రాధాన్యతహొపథకాలను చిట్టచివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆ మేరకు జిల్లాలో అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరితో సమన్వయం చేసుకుంటూ, క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ నుండి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించామన్నారు. జులై 1వ తేదీన ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు కార్యాచరణతో పటిష్టమైన చర్యలు చేపట్టమన్నారు. ఎక్కువ మొత్తంలో పెన్షన్ లబ్ధిదారులకు పంపిణి చేయాల్సి ఉంటుందని, అందిస్తున్న సదరు మొత్తాన్ని రెండు మూడు క్లస్టర్లు ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. జులై ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుండి సచివాలయ, ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తాగునీరు శానిటేషన్ పై ప్రత్యేక దఅష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డయేరియా కేసులు నమోదు కాకుండా అధికారుల కార్యచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సజావుగా నిర్వహిస్తాం : కలెక్టర్ పి.ప్రశాంతి
