ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాలను హరిస్తున్న ఇబ్రహీంపట్నం ఎన్‌టిపిపిఎస్ కాలుష్యం

బూడిద, కాంట్రాక్టులతో కోట్లు గడిస్తున్న నేతలు, పాలకులు, ఉన్నతాధికారులు
భవిష్యత్తులో అమరావతికి ఈ కాలుష్యపు సెగ
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు పాటించాలి
నెలాఖరులోపు చర్యలు తీసుకోకపోతే ఏప్రిల్‌ లో ఆందోళన చేపడుతాం
– సిహెచ్‌.బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

ఎన్‌టిఆర్‌ జిల్లా : నేడు ఇబ్రహీంపట్నంలోని బూడిద చెరువు తదితర ప్రాంతాల్లో బాబురావు, జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ తదితర నేతలతో కలిసి పర్యటించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ట్రాన్స్‌ పోర్ట్‌ కార్మికులతోను సంభాషించారు. ఈ సందర్భంగా బాబురావు, కృష్ణ మాట్లాడుతూ…… రాష్ట్రం మొత్తానికి విద్యుత్‌ ను అందిస్తున్న ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (NTPPS) కాలుష్యంతో ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల గ్రామాల్లోని లక్ష మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొందరు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ప్రజారోగ్యం క్రమంగా క్షీణిస్తోంది, శ్వాస కోస వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు కిడ్నీ తదితర వ్యాధులతో అవస్థ పడుతున్నారు.

ప్లాంట్‌ నుండి వస్తున్న పొగ, దుమ్ము, ధూళి.. బొగ్గు వలన వస్తున్న కాలుష్యం, తడి, పొడి బూడిదతో విడుదలవుతున్న కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఒకవైపు నీటి కాలుష్యం, మరోవైపు గాలి కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కలుషిత నీటితో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ప్లాంట్‌ లోపల ప్రమాదాలు, బూడిద అక్రమ రవాణా వాహనాలతో ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడ్డారు. పక్షులు, జంతువులు సైతం కాలుష్యానికి ప్రభావితమవుతున్నాయి.

మరోవైపు బూడిద అక్రమ తరలింపు, అక్రమ కాంట్రాక్టులు, ఇతర అవినీతితో పాలక పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, కొందరు ఉన్నతాధికారులు బడా కంపెనీలు కోట్లు సంపాదిస్తున్నారు. సగటున రోజుకి కోటి రూపాయలు చొప్పున సంవత్సరంలో 365 కోట్ల రూపాయలు అక్రమంగా అవినీతిని పాల్పడుతున్నట్లు జనం భావిస్తున్నారు.  కాలుష్యానికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణ కోసం స్థానికులు, ప్రజా సంఘాలు, సిపిఎం నేతలు  పలుసార్లు ఆందోళన చేపట్టారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సుమోటోగా కాలుష్య సమస్యలు చేపట్టింది, ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు పలు ఆదేశాలు ఇచ్చింది. నిపుణుల కమిటీలు తనిఖీ చేసి కాలుష్య నివారణలో విద్యుత్‌ ప్లాంట్‌ యాజమాన్యం పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారించింది

నాసిరకం బొగ్గు వలన కాలుష్యం పెరుగుతోంది. 2560 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది దశల ఈ ప్లాంట్‌ లో కాలుష్యం నివారణ చర్యలను యాజమాన్యం పూర్తిగా విస్మరించింది, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. కాలుష్యం నివారణ యంత్రాలు సాధనాలు( ESP) పని చేయడం లేదు. బొగ్గు, బూడిద రవాణాలో తగు మార్గదర్శక సూత్రాలు పాటించటం లేదు. కాలుష్యం నివారణకు నిధులు కేటాయిస్తామని ప్రకటనలే తప్ప ఆచరణ లేదు.

ప్రతిరోజు 500 పైగా వాహనాలతో బూడిద రవాణా సాగుతోంది, బడా నేతలు దీన్ని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు. బూడిద పైపులైన్లను ఉదేశపూర్వకంగా దెబ్బతీసి బూడిద అక్రమ రవాణా చేస్తున్నారు. రోడ్లు కాలువలు బూడిదతో నిండిపోయాయి. బూడిద స్టాక్‌ పాయింట్లు పెట్టి కాలుష్యం సృష్టిస్తున్నారు. బూడిద కాలుష్యంతో స్థానిక ప్రజలే కాకుండా హైవేలో ప్రయాణించే లక్షలాదిమంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బూడిద నిండిపోయి మంచి పైపులైన్లు దెబ్బతిని నీటి సరఫరా కూడా కొన్ని రోజులు నిలిచిపోయింది

రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ ఒకవైపున విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారు. మరోవైపు కార్మికులకు సరైన వేతనాలు చెల్లించకుండా వారిని దోపిడీ చేస్తున్నారు. ఇంకొక వైపు కాలుష్యాన్ని నివారించకుండా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారు. వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ధర్మల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వీటికి కారణం. ప్రజా ప్రతినిధులు, పాలక పార్టీ నేతలు, ఉన్నతాధికారులు, బడా కాంట్రాక్టర్లు కుమ్మక్కు అయ్యి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.

ప్రభుత్వం, ధర్మల్‌ ప్లాంట్‌ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ప్రజలు విసిగిపోయారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు యాజమాన్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తగు చర్యలు చేపట్టాలి. తక్షణమే కాలుష్య నివారణకు 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలకు అనుగుణంగా మార్చి నెలాఖరు లోపు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. స్థానిక ప్రజలందరికీ ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి.స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎయిమ్స్‌ ,హెల్త్‌ యూనివర్సిటీలు ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రజారోగ్యం పై సర్వే చేయించాలి. నివేదిక రూపొందించాలి.

కాలుష్యంతో, అనారోగ్యంతో, ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కలుషిత నీటి నుండి పంట పొలాలను కాపాడాలి. ఇబ్రహీంపట్నం, రాజధాని అమరావతితో ముడిపడిన ఈ కాలుష్య సమస్యపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి, అవినీతి అరికట్టాలి, కాలుష్యాన్ని నివారించాలి, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ప్రభుత్వం యాజమాన్యం స్పందించకపోతే ఏప్రిల్‌ నెలలో స్థానిక ప్రజలందరినీ కలుపుకొని ఆందోళన చేపడుతాం, ఉద్యమాన్ని ఉధృతం  చేస్తామని అన్నారు. మంగళవారం చేపట్టిన పర్యటనలో సిపిఎం జిల్లా, స్థానిక నేతలు ఎన్సిహెచ్‌.శ్రీనివాస్‌, మహేష్‌, విటల్‌, సుధాకర్‌ తదితర నేతలు పాల్గొన్నారు.

➡️