ఆగని దాడులు… ఆస్తులు ధ్వంసం

Jun 9,2024 21:36

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : ఓట్ల లెక్కింపు రోజు నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసిపి నాయకులు, కార్యకర్తలపై టిడిపి మూకలు ఉద్దేశ పూర్వకంగా విధ్వంసం సృష్టిస్తున్నారని వైసిపి నాయకుల ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి పట్టణానికి చెందిన కొందరు టిడిపి కార్యకర్తలు తొర్రగుంటపాలెంకు వైసిపి కార్యకర్త పాటి సాంబ ఇంటిలోకి చొరబడి ఇంట్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా చంపుతాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు సాంబ తెలిపాడు. సాంబ మాట్లాడుతూ శనివారం రాత్రి టిడిపి కార్యకర్తలైన తోట నరసింహారావు, ముత్యాల గోపి, తోట నాగరాజు, పాశం శ్రీరామ్‌, పాశం అశోక్‌, నాగేశ్వరరావు అనే వ్యక్తులు తనకు ఫోన్‌ చేసి ‘నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. అర్థరాత్రి 2 గంటల సమయాల్లో తన ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు ఎసి, వాషింగ్‌ మిషన్‌, ఎల్‌ఇడి టివి, ఫ్రిజ్‌ తదితర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు నగదు, బంగారాన్ని దోచుకొని వెళ్లారని చెప్పారు. పై వ్యక్తుల వల్ల తనకు ప్రాణహాని ఉందని పాటి సాంబ ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై పట్టణ వైసిపి నాయకులతో కలసి సిఐ కార్యాలయంలో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని సిఐ జానకిరామ్‌ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కెడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, వైస్‌ చైర్మన్లు తుమ్మల ప్రభాకర్‌, హఫీజ్‌ జున్నిసా ఫిరోజ్‌ ఖాన్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటూరి చిన్న, కౌన్సిలర్లు పందుల రోశయ్య, దువ్వల రామకృష్ణ, పూసల పుల్లారావు, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్‌ బాజీ, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️