విద్యా రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే

Jun 11,2024 23:02
  • ఎంఎల్‌సి కె.ఎస్‌.లక్ష్మణరావు

ప్రజాశక్తి – కంచికచర్ల : ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రస్తుత తరుణంలో కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయుల మీదే ఉందని ఎమ్మెల్సీ కెయస్‌ లక్ష్మణరావు అన్నారు. కంచికచర్లలో నన్నపనేని కల్యాణ మండపంలో మంగళవారం యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగం ఉండటం వల్ల ఇప్పటికీ పేదలు బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, కొంతమేర చదువుకొని పైకి రావడానికి అవకాశం ఏర్పడిందన్నారు. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగానికి, ప్రైవేట్‌ విద్యా రంగం పోటీ పెరగటం వల్ల కొంతమంది ప్రైవేట్‌ విద్యా రంగం వైపు వెళ్లడం జరుగిందన్నారు. ఖాళీగా ఉన్న 30 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా ఉన్న 117 జీవో రద్దుచేసి ప్రతి పంచాయతీకి ఒక మోడల్‌ స్కూల్‌ని ప్రాథమిక స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ పతాకాన్ని, యుటిఎఫ్‌ పథకాన్ని సీనియర్‌ నాయకులు కె.సంజీవరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్య కార్యదర్శి నివేదిక ప్రవేశ పెడుతూ గత ఆరు నెలల నుంచి జిల్లాలో జరిగిన విద్యారంగ అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేసిన పోరాటాలు, ఉపాధ్యాయ సంక్షేమం కోసం యూ.టి.ఎఫ్‌ చేసిన పోరాటాలు వివరించి భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధి, సంఘం అభివృద్ధి రెండు నేత్రాలుగా ఉపాధ్యాయ పని ఉండాలని చెపుతూ ఆయన నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లా కోశాధికారి పి.నాగేశ్వరావు, ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య, జిల్లా సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య, డి.అపర్ణ, జిల్లా గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి పి.నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కె.గంగరాజు, ఆడిట్‌ కమిటీ సభ్యులు పులి శ్రీనివాసరావు, ఎల్‌.చంటి, మండలం నాయకులు కె.నాగేశ్వరరావు, ఎం.రామరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️