పెండింగ్‌ వేతనాలు మంజూరు చేయకుంటే ఉద్యమం

Jun 11,2024 23:06
  • క్లాప్‌ ఆటో డ్రైవర్ల ధర్నాలో సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు
  • సమస్యను పరిష్కరిస్తామని మేయర్‌ హామీ

పెంచిన వేతనాలతో పాటు పెండింగ్‌ వేతనాలు తక్షణమే మంజూరు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని క్లాప్‌ ఆటోడ్రైవర్లు స్థానిక లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్‌ వేతనాలివ్వాలని, పెంచిన వేతనాలు అమలు చేయాలని, పని భారం తగ్గించాలని కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, లేబర్‌ కమిషనర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ప్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు మాట్లాడుతూ… క్లాప్‌ ఆటో డ్రైవర్లు న్యాయమైన డిమాండ్స్‌ను పరిష్కరించాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచిన వేతనాలు, పెండింగ్‌ వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. చాలీచాలనీ వేతనాలతో ఆటోడ్రైవర్ల కుటుంబాలు గడవక తీవ్రకష్టాలు పడుతున్నారని, అయినా రెండు నెలల వేతనాలివ్వకుండా, సమ్మె కాలం ఒప్పందాలు అమలు చేయకుండా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, ‘స్వయంభూ’ కాంట్రాక్ట్‌ సంస్థ క్లాప్‌ ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. 25 రోజుల నుంచి క్లాప్‌ ఆటోలు నగర వ్యాప్తంగా నిలిచిపోయినా, చెత్త తరలింపు ఆగిపోయి, శానిటేషన్‌ సమస్యలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నా… నగర మేయర్‌, అధికారులు పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా స్వయంభూ కాంట్రాక్ట్‌ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. గత నెల 10న వేతనాలు ఇస్తామని చెప్పిన కాంట్రాక్టర్‌ నేటికీ అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికయినా నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ, ఇటు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు క్లాప్‌ ఆటో డ్రైవర్ల సమస్యలపై అత్యవసర సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది సమ్మెలోకి రావడం ఖాయమని హెచ్చరించారు. క్లాప్‌ ఆటో డ్రైవర్ల వేతనాల అంశంపై సదరు కాంట్రాక్టర్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారి వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌, లేబర్‌ కమిషనర్‌ తెలిపినట్లు యూనియన్‌ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు ఎస్‌.జ్యోతిబాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి టి.ప్రవీణ్‌,క్లాప్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ కార్యదర్శి కె.కిరణ్‌, అధ్యక్షులు శివ, రామ్‌ కుమార్‌, అనిల్‌, గోపి, రుద్ర, రామరాజు, డ్రైవర్లు పాల్గొన్నారు.

➡️