మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు
ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్): మైలవరం నియోజకవర్గంలో 37,744 మందికి డిసెంబరు మాసంలో రూ.15,98,31,000 ల పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును ఆయన శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చుతోందన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు అభివృద్ధితో పాటు పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రతినెలా ఠంచనుగా 1వ తేదీన తెల్లవారుజామునే తలుపు తట్టి పేదల ఇళ్లకే నేరుగా పింఛన్ల సొమ్ము అందజేస్తున్నారన్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారికి సొమ్మును అందజేసి, భరోసా కల్పించారు. ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.