చెత్త పన్ను రద్దు చేయాలని వినతి

Jun 11,2024 23:07

ప్రజాశక్తి – విజయవాడ : చెత్త పన్ను రద్దు చేసి, నగర ప్రజలకు భారం లేకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్లోర్‌ లీడర్‌ బోయి సత్యబాబు పేర్కొన్నారు. చెత్త పన్ను రద్దు కోరుతూ.. రాబోయే కౌన్సిల్‌ సమావేశం ఎజెండాలో ప్రతి పాదనను పొందు పరచడం జరిగిందని, దానిని కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి తీర్మానాన్ని ఆమోదించడానికి మేయర్‌ అనుమతి మంజూరు చేయాలని కోరుతూ సత్యబాబు నగర మేయర్‌కు ఆమె చాంబర్‌లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. అలాగే సమ్మె చేస్తున్న క్లాప్‌ ఆటో డ్రైవర్ల పెండింగ్‌ వేతనాలతోపాటు వేతనాలుపెంచి డ్రైవర్లును ఆదుకోవాలని కోరుతూ మరొక వినతిపత్రాన్ని మేయర్‌కు అందజేశారు. ఈ సందర్బంగా తన చాంబర్‌లో సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తం చర్యల్లో భాగంగా విజయవాడ నగరంలో చెత్త పన్నును నిలుపుదల చేయడానికి నూతన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నివాస గృహాలు, వాణిజ్య సంస్థల నుంచి చెత్త సేకరిస్తున్నామనే పేరుతో గత వైసిపి ప్రభుత్వం యూజర్‌ చార్జీలను వసూలు చేయడం అత్యంత దారుణమని అన్నారు. ఇటువంటి భారాలకు వ్యతిరేకంగా గత వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపారని గుర్తు చేశారు. నగర ప్రజలకు సరఫరా చేస్తున్న కలుషిత నీటిని తాగి పలు ప్రాంతాల్లో డయేరియా బారిన పడి, పలువురు మృత్యువాత పడ్డారని అన్నారు. ఇటువంటి అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశాలపై చర్చించడానికి వెంటనే కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మేయర్‌ను కోరినట్లు సత్యబాబు తెలిపారు. చెత్త పన్ను రద్దుకు పార్టీలకతీతంగా కార్పొరేటర్లు ముందుకు రావాలని కోరారు.

➡️