ఏలూరులో అకాల వర్షం

పలు రోడ్లు జలమయం
నిలిచిన విద్యుత్‌ సరఫరా
వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులు
పలు అవస్థలకు గురైన చిరు వ్యాపారులు
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
ఏలూరు నగరంలో ఆదివారం రాత్రి గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఈదురు గాలులు ఎక్కువ కావడంతో ఒక్కసారిగా నగరానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో నగరం అంధకారంలో మునిగిపోయింది. హఠాత్తుగా వచ్చిన వర్షంతో ఓవైపు నగరంలో రోడ్లు జలమయం, అంధకారంలో మునిగినప్పటికీ పగలంతా వేడి తాపంతో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో సేదతీరారు. రోడ్లు జలమయం కావడంతో ప్రయాణికులు, వాహనదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు.దెబ్బతిన్న చిరు వ్యాపారులుఏలూరు అర్బన్‌ : ఏలూరు నగరంలో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షం చిరు వ్యాపారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రి 7:30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత రెండు రోజులుగా నగరంలో విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ఉన్న నగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో సేద తీరారు. గత కొన్నేళ్లుగా సండే మార్కెట్‌ నగరంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా టూ టౌన్‌ ప్రాంతంలోని ఆర్‌ఆర్‌.పేట మెయిన్‌ రోడ్డులో వందలాది దుకాణాలు, రోడ్డు పక్కన పెట్టే చిరు వ్యాపారాలు విపరీతంగా పెరిగి సండే మార్కెట్‌కు జనం విపరీతంగా అలవాటు పడ్డారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆ రోడ్డులో వేలాదిమంది ప్రజలు వారికి కావాల్సిన రకరకాల బట్టలు, ప్లాస్టిక్‌, స్టీల్‌, ఫ్యాన్సీ సామగ్రి కొనడమే కాకుండా పిల్లలతో ఆర్‌ఆర్‌ పేట పార్కుకు వెళ్లి కొద్దిసేపు గడుపుతారు. దీంతో ఆదివారం వస్తే బట్టల దుకాణాల యజమానులు రకరకాల డిస్కౌంట్లు ఇస్తూ మైకులు పెట్టి మరీ అరుస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ రోడ్డులో రకరకాల తినుబండారాల వ్యాపారం సైతం పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే ఆదివారం అకస్మాత్తుగా వర్షం కురవడంతో చిరు వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. తమ సరుకు తడిచిపోకుండా ఎక్కడికక్కడ వ్యాపారులు దుకాణాలపై ప్లాస్టిక్‌ పట్టాలు కప్పుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కొన్ని దుకాణాల్లో సరుకులు తడిసిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా వేసవి సీజన్‌ కావడంతో విపరీ తమైన రద్దీగా ఉండే ఫ్రూట్‌ జ్యూస్‌ షాపులు సైతం వర్షం వల్ల వెలవెలబోయాయి. మొత్తం మీద ఏలూరు నగరంలో ఆకస్మాత్తుగా కురిసిన వర్షం చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. వారం మొత్తం ఎదురు చూసి పెద్ద మొత్తంలో సరుకు తెచ్చుకుని వ్యాపారం కోసం ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది.

➡️