దాడులపై సామినేని మండిపాటు

Jun 10,2024 21:51

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : టిడిపి దాడులకు ప్రతి దాడులుంటాయని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను హెచ్చరించారు. నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తలపై దాడులు, ఇళ్ళు, ఆస్తులను ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. సోమవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వైసిపి ముఖ్య నాయకులతో కలిసి ఉదయభాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇకనుంచి దాడులు ఆపకపోతే ప్రతి దాడులకు సైతం తాము వెనకాడబోమని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఏనాడూ దాడులను ప్రోత్సహించలేదని చెప్పారు. వైసిపి కార్యకర్తలను విచక్షణరహితంగా కొట్టడం, ఇళ్ళపై రాళ్ళు విసిరి విలువైన వస్తువులను ధ్వంసం చేయడం, శిలాఫలకాలు, పార్టీ జెండా దిమ్మెలను కూల్చడం వంటి చర్యలపై ఉదయభాను ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట టిడిపి నాయకులు తక్షణమే స్పందించి దాడులను ఆపించాలని అన్నారు. కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని చెప్పారు. దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు 41ఏ నోటీసు ఇచ్చి పంపిస్తున్నారని, ఇలాగైతే శాంతిభద్రతలు ఎలా అదుపులో ఉంటాయని ప్రశ్నించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలపై ఎక్కడెక్కడ దాడులు జరిగాయో, అస్తులు, శిలాఫలకాలు, జెండాదిమ్మెల ధ్వంసం వంటి ఘటనలను ఆయన వివరిస్తూ ఫొటోలను ప్రదర్శించారు. వైసీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఉదయభాను భరోసానిచ్చారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని, జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీరాం రాజగోపాల్‌కి ఉదయభాను అభినందనలు తెలిపారు.

➡️