రాష్ట్రంలో తొలిసారిగా వి.ఎ.ఎక్మో చికిత్స

May 25,2024 20:48
  • ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌లో అత్యాధునిక వైద్య సేవలు

ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్శిటీ : రాష్ట్రంలోనే తొలిసారిగా వి.ఎ.ఎక్మో చికిత్స ద్వారా హార్ట్‌ ఎటాక్‌కు గురైన యువ ఇంజనీర్‌కు ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌ అత్యుత్తమ వైద్యం అందించినట్లు ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌ సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ రామారావు తెలిపారు. గుంటూరులోని హాస్పటల్‌ కాన్ఫరెన్స్‌హాల్‌ నందు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాప్టువేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్త్ను 35 సంవత్సరాల యువకుడు మంగళగిరిలోని గుడికి వెళ్లి వస్తూ ఛాతి నొప్పిగా, బరువుగా అనిపించి గ్యాస్‌నొప్పి అనుకుని టాబ్లెట్‌ తీసుకున్నాడన్నారు. అయితే నెప్పి తీవ్రత పెరగడంతో మంగళగిరిలోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఈసీజీ పరీక్ష నిర్వహించి వెంటనే గుండె జబ్బుల వైద్యం అందించే హాస్పటల్‌కు వెళ్లాల్సిందిగా సూచించారన్నారు. వారు వెంటనే రమేష్‌ హాస్పటల్స్‌కు వచ్చారని ఆసుపత్రికి రాగానే రోగిని పరీక్షించి గుండె పంపింగ్‌ తగ్గిపోవడం, కార్డియోజెనిక్‌ షాక్‌, పల్మనరీ ఎడిమా వంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న రోగికి వెంటనే వెంటిలేటర్‌ అమర్చి చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. ఇంట్రా అయోటిక్‌ బెలూన్‌ పంపు అమర్చి యాంజియోగ్రామ్‌ పరీక్ష నిర్వహించగా గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళం 100 శాతం రక్తపు గడ్డలతో పూడిపోయి ఉండటం గమనించినట్లు తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ యాంటియోప్లాస్టీ చికిత్స ద్వారా రక్తపు గడ్డలను తొలగించినట్లు తెలిపారు. ఇటువంటి వైద్య చికిత్స మొదటిసారిగా ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌లో నిర్వహించామని తెలిపారు. సడన్‌ హార్ట్‌ ఎటాక్‌ వలన సంభవించే దుష్ఫలితాలను అధిగమించడానికి ఎక్మో తరహా వైద్య విధానం ఎంతో మేలు చేస్తుందని డాక్టర్‌ సరిత తెలిపారు. ఈ సందర్భంగా అత్యాధునిక వైద్యం అందించిన ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్‌ వైద్య బృందాన్ని ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు అభినందించారు. ఈ సమావేశంలో ఆస్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమత రాయపాటి, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ కార్తీక్‌ చౌదరి పలువురు వైద్యులు పాల్గొన్నారు.

➡️