ప్రజాశక్తి-చీరాల: అంతర్జాతీయ చేనేతల దినోత్సవాన్ని చీరాలలో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా పాలనలో ఎలాంటి ఆడంబరం లేకుండా సిఎం చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని, తాము చెట్లు కొట్టడం లేదని, పరదాలు వేయలేదని, దుకాణాలు మూయడం లేదని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు చీరాల మండలం జాండ్రపేట హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని చేనేత జౌళి శాఖ మంత్రి సబిత, జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మలతో కలిసి మంగళవారం సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత టెక్స్టైల్ పార్కుకు అంతర్జాతీయ చేనేత దినోత్సవంతో తొలి అడుగు పడింని అన్నారు. టెక్స్ట్‌టైల్ పార్కు నిర్మాణమే కాకుండా అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజాక్షేత్రంలో నియోజకవర్గ ప్రజలకు చెప్పిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేనేతలకు అందాల్సిన పింఛను వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అందిందని, నిజమైన చేనేత లబ్ధిదారులకు నిరాశ మిగిలిందని అన్నారు. చీరాలలో ఫైర్ స్టేషన్ వద్ద నిర్మాణం జరగనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఎంపీ కృష్ణ ప్రసాద్‌తో సమన్వయం చేసుకొని రాబోయే ఐదు సంవత్సరాలలో కచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో టిడిపి హయాంలో చేనేతలకు రాజయోగం ఉందని, నా చేనేతలు అని ఓట్ల వేయించి కొని వైసిపి అధికారంలోకి వచ్చాక చేనేతలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. టిడిపి అధికారంలోకి రావడంతో చేనేతలందరికీ పూర్వ వైభవం వచ్చిందని, వారు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. చేనేత దినోత్సవాన్ని కేవలం చేనేతల మధ్యలో జరపాలని, వారితో నేరుగా మాట్లాడే వారి సమస్యలు తెలుసుకోవాలని ఈ సభను చీరాలలో ఏర్పాటు చేయటంతో చేనేతలందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసిపి పాలనలో చేనేతలకు చేసింది ఏమీ లేదన్నారు. చేనేతలకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసి వారి సమస్యల పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నేరుగా చీరాలలో చేనేత సభను నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. వారి వెంట టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుచ్చేశ్వరరావు, సజ్జా హేమలత, గొడుగుల గంగరాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.