ముగిసిన పొగాకు 4 రౌండ్ల కొనుగోళ్లు

ప్రజాశక్తి-కొండపి కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నాటితో 4 రౌండ్ల పొగాకు కొనుగోళ్లు ముగిశాయని గురువారం నుంచి 5వ రౌండ్‌ పొగాకు కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని వేలం నిర్వహణాధికారి జి సునీల్‌కుమార్‌ తెలిపారు. నాలుగో రౌండ్‌ పూర్తి అయ్యేనాటికి 5.11 మిలియన్ల పొగాకు అమ్మగా అందులో అత్యధిక ధర కిలో రూ.300, అత్యల్ప ధర కిలో రూ.205, సరాసరి ధర కిలో రూ.237.36 పలికింది. అలాగే 4వ రౌండ్‌ పూర్తి అయ్యేనాటికి బ్రైట్‌రకం సరాసరి ధర కిలో రూ.248.99, మీడియం రకం పొగాకు సరాసరి ధర కిలో రూ.254.50, లోగ్రేడు పొగాకు సరాసరి ధర కిలో రూ.230.76 పలికిందన్నారు. మొత్తం మీద బ్రైట్‌ గ్రేడ్‌ భాగము 15శాతం, మీడియం గ్రేడు భాగము 16శాతం, తక్కువ గ్రేడ్‌ భాగము 69 శాతం అమ్మకాలు జరిగాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో రూ.121,30,75,613.90 జమ చేసినట్లు తెలిపారు. ఐదవ రౌండ్‌లో పుల్‌ బ్యారన్‌కు 4 బేళ్లు వంతున ఇస్తున్నట్లు వేలం నిర్వహణాధికారి తెలిపారు. సాఫ్ట్‌ హీటడ్‌ బేల్స్‌ లేకుండా చూసుకోవాలని, 150 కేజీలు కంటే ఎక్కువ లేకుండా చెక్‌ చేసుకోవాలని తెలిపారు. ఆశాజనంగా ధరలు.. ఆనందంలో రైతులు కొండపి పొగాకు వేలం కేంద్రంలో మొదటి రెండు రౌండ్లలో ధరలు నిరాశ పరిచాయి. బ్రేడ్‌ రకం బేళ్లు అనుకున్నంత గిట్టుబాటు ధర లభించలేదని రైతులు తెలిపారు. కాని మూడో రౌండ్‌లో సగం నుంచి మొదలై నాలుగో రౌండ్‌లో రోజురోజుకూ బ్రైట్‌ రకం పొగాకు ధరలు పెరుగుతూ వచ్చాయి. బుధవారం నాటికి గరిష్ఠ ధర కిలో రూ.300 పలికింది. మీడియం, లోగ్రేడు పొగాకు ఒక రకమైన గిట్టుబాటు ధర లభిస్తున్నాయని, లోగ్రేడు పొగాకు అమ్మకాల వలన ఎటువంటి ఇబ్బందులు లేవని రైతులు ఆనందంగా తెలిపారు. నెంబర్‌ పొగాకుకు ఇదే ధర లభిస్తే రైతు వద్ద ఉన్న 40 శాతం నెంబర్‌ పొగాకుకు మంచి ధరలు వచ్చినట్లేనని రైతులు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మిగతా బోర్డు కంటే కొండపి బోర్డు బ్రైట్‌ రకం పొగాకు ధరలు పెంచింది. ఇదే విధంగా ధరలు మిగిలిన అన్ని రౌండ్లలో పలికితే పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని ఖర్చులు పోను రైతులకు లాభాలు చేరుకూరుతాయని రైతులు తెలిపారు. బుధవారం వేలం వివరాలుబుధవారం కొండపి వేలం కేంద్రానికి చినవెంకన్నపాలెం, వెన్నూరు గ్రామాలకు చెందిన రైతులు 826 బేళ్లను అమ్మకానికి ఉంచారు. అందులో 781 బేళ్లను కొనుగోలు చేయగా మిగిలిన 45 బేళ్లు వివిధ కారణాల చేత ఇంటికి తిరుగుముఖం పట్టాయి. అత్యధిక ధర కిలో రూ.300, అత్యల్ప ధర కిలో రూ.205 సరాసరి ధర కిలో రూ.264.01 పలికిందని తెలిపారు.

➡️