నూట్రి స్మార్ట్‌ గ్రామంగా పాకల అభివృద్ధి

ప్రజాశక్తి-శింగరాయకొండ కృషి విజ్ఞాన కేంద్రం, కందుకూరు సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి ప్రసాద్‌ బాబు, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి నీహారిక ఆధ్వర్యంలో శింగరాయకొండ మండలం పాకల గ్రామంలో షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కింద మహిళలకు కూరగాయ విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. డాక్టర్‌ జి ప్రసాద్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఇంటి పెరటిలో పోషకాహార కూరగాయలను, ఆకు కూరలను పెంచుకోవడం ద్వారా పోషకాహార భద్రత కల్పించి పాకల గ్రామాన్ని ”న్యూట్రి స్మార్ట్‌ గ్రామంగా” తయారు చేస్తున్నామని తెలిపారు. డాక్టర్‌ బి నిహారిక మాట్లాడుతూ ఈ కిట్లలో టమాట, బ్రాడ్‌ బీన్స్‌, చిక్కుడు, వంగ, యార్డ్‌ లాంగ్‌ బీన్స్‌, తోటకూర, మిరప వంటి 8 రకాల కూరగాయల విత్తనాలు ఉంటాయని తెలియజేశారు. వాటిని శాస్త్రీయంగా పెంచు కునే విధానాలను, ఉత్తమ యాజమాన్య పద్ధతులను, సమగ్ర సస్య రక్షణ చర్యలను వివరించారు. పోషకాహార భద్రత కోసం సామూహిక పెరటి తోటలు, బయోఫోర్టిఫైడ్‌ చిరుధాన్యాలు (రాగులు, సజ్జలు, సామలు) పెంపకంపై ప్రథమ శ్రేణి ప్రదర్శనలు ఇచ్చారు. ఏపీసీన్ఫ్‌ సి మండల ఇంచార్జ్‌ వెంకటరమణ ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం, కషాయాలు, జీవామృతం వంటివి తయారు చేసే విధానాన్ని, వాడే పద్ధతులను, పురుగు మందులు లేకుండా కూరగాయల పెంపకాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాకల రైతు సేవా కేంద్రం గ్రామ వ్యవసాయ సహాయకుడు సురేష్‌, ఐసిఆర్‌పి రామసుబ్బమ్మ, గ్రామ సంఘం విఓఎ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

➡️