ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : కుష్టువ్యాధి లక్షణాలు గుర్తించడానికి సర్వే చేపడుతున్న తీరు, ఏ మేరకు పూర్తి చేశారన్న వివరాలను రు వివరాలను వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు పరిశీలించారు. మండలంలోని ఎంఆర్ నగరం, చినబొండపల్లి గ్రామాలను సోమవారం సందర్శించి హెల్త్, వెల్నెస్ కేంద్రాలు, లెప్రసీ సర్వే తనిఖీ చేశారు. అనుమానిత లక్షణాలతో ఎవరినైనా గుర్తించారా అని ఆరా తీసి సర్వే పూర్తి చేసి, ఇంటికి మార్కింగ్ విధానాన్ని గమనించారు. ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందర్నీ క్షుణ్ణంగా పరీక్షించాలన్నారు. లక్షణాలను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని సూచించారు. కుష్టువ్యాధిని గుర్తించే లక్షణాల కరపత్రికలను ప్రజలకు అందజేసి అవగాహన కల్పించాలన్నారు. అక్కడ స్థానికులతో డాక్టర్ జగన్మోహన్ మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఓపి రికార్డులు, మందులు తనిఖీ చేశారు. ప్రతి రోజూ ఎంత మందికి ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు, అందిస్తున్న చికిత్సా వివరాలు పరిశీలించారు. మందుల లభ్యత, కాలపరిమితి పరిశీలించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలు వైద్య అవసరాల నిమిత్తం ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సత్తిబాబు, జయలక్ష్మి, వైద్య సిబ్బంది పద్మావతి, కమలకుమారి, నందిని, పోలమ్మ, ఆశా కార్యకర్తలు, సిహెచ్‌డబ్ల్యుఒలు పాల్గొన్నారు.సీతానగరం: మండలంలోని సీతానగరం, పెదఅంకలాం పిహెచ్‌సిల పరిధిలో గల అన్ని సచివాలయాలో పరిధిలో కుష్టి వ్యాధి గుర్తింపుపై ఇంటింటా సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యాధికారులు పి.ఉషారాణి, ఎం.రాధాకాంత్, పి.పావని మాట్లాడుతూ వైద్య సిబ్బంది వచ్చేటప్పుడు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఎస్వీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
