అధిక విద్యుత్ బిల్లులతో గిరిజనులు బెంబేలు
ఒకరికి రూ.1.60 లక్షలు, మరొకరికి రూ.29 వేలు
ప్రజాశక్తి-కొత్తకోట (అనకాపల్లి జిల్లా) : రూ.వేలు, లక్షల్లో కరెంట్ బిల్లులు రావడంతో అనకాపల్లి జిల్లా రావికమతం మండలం టి.అర్జాపురం శివారు డోలవానిపాలెం గ్రామానికి చెందిన పేద గిరిజనులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామానికి చెందిన డోల సత్తిబాబు ఇంటికి ఈ నెల రూ.1.60 లక్షలు బిల్లు వచ్చింది. ఈ విషయమై అతని తల్లి లక్ష్మి మాట్లాడుతూ తమ ఇల్లు శిథిలం కావడంతో నాలుగేళ్లుగా వేరొకరి ఇంట్లో అద్దెకు ఉంటున్నామన్నారు. అప్పటి నుంచి పాత విద్యుత్ మీటర్‌ను వాడటం లేదని తెలిపారు. ఇటీవలే సొంత ఇల్లు కట్టుకుని మీటర్ బిగించుకున్నామన్నారు. దానికి ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వచ్చిందని చెప్పారు. పాత ఇంటిలో బల్బు, టివి మాత్రమే వాడేవారిమని తెలిపారు. తాము గిరిజనులమని, ప్రతి నెలా 200 యూనిట్లులోపు వాడుతున్నందున ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఉన్నందున అప్పట్లో బిల్లు వచ్చేదికాదని చెప్పారు. ఈ నెల రూ.1.60 లక్షల బిల్లు వచ్చిందని ఆమె వాపోయారు. కూలి పనులతో పొట్టపోసుకునే తాము ఇంత బిల్లు ఎలా కట్టగలమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరో గిరిజనురాలు గాది కొండమ్మ మాట్లాడుతూ తన భర్త నాగరాజు పేరున విద్యుత్ కనెక్షన్ ఉందని, ప్రభుత్వ ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా పదేళ్లుగా తమకు బిల్లు రావడం లేదని తెలిపారు. ఈ నెల రూ.29,913 బిల్లు రావడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు. ఇంటిలో బాలింత ఉందని, బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని అంటున్నారని ఆమె వాపోయారు.
సాంకేతిక లోపం కారణంగానే : ఎఇ నందన్
అధిక బిల్లుల విషయమై మండల విద్యుత్ శాఖ ఎఇ నందన్‌ను ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా సాంకేతిక లోపంతోనే బిల్లులు అధికంగా వచ్చాయని, తొందరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.