పల్లెపండుగ పనులు వంద శాతం పూర్తి : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో రూ.100 కోట్ల అంచనాతో చేపట్టిన పల్లె పండుగ పనులను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి పల్లె పండుగ పనులు, ఇండ్ల నిర్మాణ ప్రగతిపై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, మండల స్థాయి ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పల్లె పండుగ ద్వారా మంజూరైన పనులు ఎన్ని, పూర్తి చేసినవి ఎన్ని, ప్రగతిలో ఉన్నవి ఎన్ని, కొత్తగా మంజూరైన వాటిలో చేపట్టిన పనులు, సాధించిన ప్రగతి అంశాలను సమీక్షించారు. ఇంకనూ ప్రారంభించని పనులపై ఆయా మండల అధికారులతో కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రగతిలో వెనకబడిన రైల్వేకోడూరు, రాజంపేట, తంబళ్లపల్లి మొలకలచెరువు, బి.కొత్తకోట తదితర మండలాల అధికారులతో సమీక్షించి కారణాలు అడిగి తెలుసుకుని ప్రగతి సాధనకు తగు సూచనలు జారీ చేశారు. పల్లె పండుగ పనులన్నీ ఈ మాసాంతంలోగా పూర్తి చేయాలని, ఎవ్వరూ పనులు పెండింగ్‌ ఉంచరాదని, పంచాయతీరాజ్‌ ఇఇలు, డిఇలు బాధ్యత తీసుకొని పనుల పూర్తికి కషి చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే ఎల్‌ఎల్‌, ఆర్‌ఎల్‌, ఆర్సి స్థాయిలో ఉన్న ఇళ్లను మార్చి మాసాంతంలోగా పూర్తి చేయడానికి గహ నిర్మాణశాఖ అధికారులు చిత్తశుద్ధితో కషి చేయాలని గహ నిర్మాణ శాఖ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. వారం వారం దశల వారీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని, మొత్తం ఇళ్లను పూర్తి చేయడానికి బాధ్యతాయుతంగా కషి చేయాలన్నారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒ, హౌసింగ్‌ డిఇ, ఎఇలు పూర్తి సమన్వయంతో స్పెషల్‌ డ్రైవ్‌ మోడ్‌ క్రింద ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని తెలిపారు. విధి నిర్వహణలో ఎక్కడైనా అలసత్వం వహిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎక్కడైనా ఇసుక, సిమెంటు, స్టీలు సమస్య ఉందా అని అధికారులతో ఆరా తీశారు. లక్ష్యంలో వెనుకబడిన మండలాలలో ప్రతి బుధవారం హౌసింగ్‌ ప్రోగ్రాం జరగాలని, ప్రతి శనివారం లేఅవుట్‌ సందర్శన తప్పనిసరిగా చేసి లక్ష్యం ప్రగతి సాధనకు కషి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌, హౌసింగ్‌, డిఆర్‌డిఎ, జిఎస్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, మండల ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️