ప్రజాశక్తి-విజయనగరంకోట : స్టయిఫండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహ ధారుడ్య ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఈ ఎంపిక ప్రక్రియకు గురువారం పిఎంటి, పిఇటి. పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా, 415 అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వారిలో 314 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. నియామకాల ప్రక్రియ వేకువ జామున 5గంటల నుండే ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో సకాలంలో పూర్తయ్యాయి. అయితే పలువురు అభ్యర్థుల పుట్టిన తేదీ పోలీసుశాఖ పంపిన కాల్ లెటర్లలో తప్పుగా పడడంతో వారిని ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అధికారులు నిరాకరించారు. ఆ తప్పును సరిచేసి పోలీసుశాఖకు మెయిల్ ద్వారా పంపి, అక్కడ నుంచి అనుమతి వచ్చిన తరువాత దేహ దారుఢ్య పరీక్ష నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. 24గంటల్లో అనుమతి మంజూరు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు తెలిపారు. పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్‌పి వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. అభ్యర్ధులకు ముందుగా హాల్ టిక్కెట్స్ను పరిశీలించి, పోలీసు పరేడ్ గ్రౌండులోకి అనుమతించారు. అనంతరం, అభ్యర్ధుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిర్ధారించే ధవ్రపత్రాలను పరిశీలించి, అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకొని, పి.ఎం.టి. పరీక్షలకు అనుమతించారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఎక్విప్‌మెంట్స్ వినియోగించి, అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలను నిర్ధారించి, అర్హత సాధించిన అభ్యర్థులకు పిఇటి. పరీక్షలను అనుమతించామని ఎస్‌పి వకుల్ జిందల్ తెలిపారు. నియామక ప్రక్రియలో అదనపు ఎస్‌పి పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్‌పి జి.నాగేశ్వరరావు, డిఎస్‌పిలు ఎం.వీరకుమార్, యూనివర్స్, ఎస్.రాఘవులు, టి.ఎన్.శ్రీనివాసరావు, కే.థామస్ రెడ్డి, ఎఒ పి.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పిఇటిలు పాల్గొన్నారు.
