ఉల్లిః రైతులకు కన్నీరే

ప్రజాశక్తి – చాపాడు ఉల్లి ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. అటు సాగు చేస్తున్న రైతులకు కూడా ఇబ్బందికరంగానే మారాయి. అడఫాదడపా వర్షాల కారణంగా సాగుచేసిన పంట దెబ్బతినడంతో ఒకటికి రెండుసార్లు సాగు ఖర్చులు రైతు మీద పడుతున్నాయి. గతంలో వంద కిలోల విత్తనాల ధర రూ. 40 నుంచి 45 వేల లోపు మాత్రమే. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా విత్తనాల ధర రూ.90 వేలకు చేరుకొని రైతులను కలవర పెడుతోంది. ఎకర సాగుకు ఖర్చు రూ. 40వేలు అవుతుండడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జూన్‌ , జులై నెలల్లో రూ. 30 వేలు వెచ్చించి విత్తనాలు సేకరించి రైతులు సాగు చేపట్టారు. అయితే వర్షం సరిగా పడకపోవడంతో సాగు దెబ్బతింది. రైతులు తిరిగి ఉల్లి పంట సాగు చేయాలని ముందుకెళితే విత్తనాల ధరతో కొనుగోలు చేయలేకపోతున్నారు. సరైన గిట్టుబాటు ధర వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ధరలు క్వింటాలు రూ.10 వేల వరకు ఉంటాయన్న కారణంతో సాగు చేపడుతున్నారు. వర్షాలు లేక పంట దెబ్బతిని ఆర్థికంగా నష్టం ఏర్పడినప్పటికీ తిరిగి సాగుకు యత్నం చేపట్టారు. జిల్లాలో దువ్వూరు, మైదుకూరు, చాపాడు, ఖాజీపేట, తదితర ప్రాంతాల్లో 6వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులు కర్ణాటక ప్రాంతంలోని చిక్బలాపూర్‌ ,గోర్‌ బెద్దనూర్‌, నంద్యాల నుంచి విత్తనాలను సేకరించి సాగు చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక రకం క్వింటాల్‌ రూ .6 వేల వరకు పలుకుతున్నాయి. క్వింటాల్‌ రూ.7 వేల నుంచి 10వేల గిట్టుబాటు ధరలు ఉంటే రైతులు సాగు ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. రూ.90 వేలతో విత్తనాల కొనుగోలుచేశా రెండు ఎకరాలలో మొదటిసారి క్వింటా రూ. 90వేల వెచ్చించి 30 కిలోల ఉల్లి విత్తనాలు నంద్యాల నుంచి తీసుకువచ్చి సాగు చేపట్టా. వర్షానికి దెబ్బతినడంతో రెండవసారి 60 కిలో కొనుగోలు చేసి సాగు 4ఎకరాలు చేపట్టాను. విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేసి ఉంటే ఉపయోగకరంగా ఉండేది . – ప్రసాద్‌ , సిద్దారెడ్డిపల్లె, చాపాడు మండలం. రెండు దఫాలు సాగు చేపట్టా ఈ ఏడాది సరైన వర్షాల లేని కారణంగా రెండు దఫాలు సాగు చేయాల్సి వచ్చింది. జూన్‌ చివరి లో రూ .90వేలు ఉన్న విత్తన ధరలు అమాంతం పెరిగి లక్షకుపైగా చేరుకున్నాయి. దిగుబడి వచ్చే సరికి ధరల పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంగా ఉంది, రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి . – శివరామ్‌, బయనపల్లె, దువ్వూరు మండలం.

➡️