ఆప్కాస్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఆప్కాస్‌ కార్మికులందరినీ ప్రభుత్వం రెగ్యులర్‌ చేయాలని, రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆప్కాస్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని జిజిహెచ్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్కాస్‌ వ్యవస్థను తీసివేసి గతంలో మాదిరిగా థర్డ్‌ పార్టీ కాంట్రాక్టర్‌ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇలా చేయడం వల్ల కార్మికులు మరింత పేదలుగా మారిపోతారని పేర్కొన్నారు. ఆప్కాస్‌ విధానం ఉండడంవల్ల కార్మికులకు నెలనెలా కచ్చితంగా వేతనాలు వస్తున్నాయని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా అమలవుతుందని చెప్పారు. అదే థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు ఇస్తే కార్మికులను భూమి మీద నుంచి నూతిలో పడేసినట్లవుతుందని తెలిపారు. ఇప్పుడు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉన్న శానిటేషన్‌, సెక్యూరిటీ వారికి జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. చట్టం ప్రకారం పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా కట్టడం లేదని తెలిపారు. కార్మికులు తమకు వేతనాలు సక్రమంగా ఇవ్వాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా కట్టాలని అని అడిగితే కాంట్రాక్టర్లు వారి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయం ప్రభుత్వానికి, కార్మికులకు తెలుసన్నారు. కడప జిజిహెచ్‌లో శానిటేషన్‌, సెక్యూరిటీ సబ్‌ కాంట్రాక్ట్‌ నిర్వహిస్తున్న జె.బాల నారాయణరెడ్డి అనే కాంట్రాక్టర్‌ శానిటేషన్‌, సెక్యూరిటీ కార్మికులు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని చెప్పారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా కట్టడం లేదని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వచ్చిన సందర్భంగా అర్జీ ఇచ్చిన కారణంగా ముగ్గురి కార్మికులను తొలగించారని తెలిపారు. మిగతా కార్మికులను ఎలాగైనా తొలగించాలనే ఉద్దేశంతో ఆయన కావాలనే నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఆప్కాస్‌ రద్దు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ మొదలవుతుందని, కార్మికులు బతకలేని పరిస్థితుల్లో అప్పుల పాలు కావడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌ రద్దు అనే అంశాన్ని పక్కనపెట్టి ఆప్కాసులు ఉండే కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, రిమ్స్‌ ఆప్కాస్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కమిటీ కోశాధికారి బి.బాలాజీ రావు, ఉపాధ్యక్షులు భాస్కర్‌, రామకష్ణ, ఏసన్న, సుదర్శన్‌, కార్యదర్శులు కొండయ్య, చెన్నయ్య, సురేష్‌, ల్యాబ్‌ కమిటీ సభ్యులు జయరాం, కన్నయ్య, జయసుధ, మరియమ్మ, గాంధీ నాయక్‌, శ్రీనివాసులు, సుబ్బారావు, పవన్‌, కార్మికులు జయ కాంత్‌, ప్రసాద్‌, బి.నాగేంద్ర, డి.వి.రమణ, సుబ్బరాయుడు, నరసయ్య, ఆప్కాస్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️