చెవికి ఆపరేషన్‌ చిన్నారి మృతి

Feb 18,2025 01:26

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వినికిడి లోపం నేపథ్యంలో కాక్లియర్‌ ఇంప్లాటేషన్‌ ఆపరేషన్‌ చేసే క్రమంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందగా ఆస్పత్రి ఎదుట మృతుని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన విక్రమ్‌ ఆదిత్య (3) పుట్టుకతో వినికిడి లోపం ఉండడంతో పలు హాస్పిటల్‌లో పరీక్షలు చేయించిన అనంతరం నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌లో ఇటీవల చేర్చారు. చిన్నారికి జ్వరం రావడంతో జ్వరం తగ్గిన తర్వాత రావాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తామని చెప్పి రూ.1.50 లక్షలు అడిగారని, రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకుని చెల్లించామని చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జ్వరం తగ్గిన అనంతరం ఆదివారం రాత్రి కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ శస్త్ర చికిత్స చేయగా చిన్నారి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ఆపరేషన్‌కు కొంత సమయం ముందు కూడా తమ బిడ్డ సెల్‌ఫోన్‌తో ఆడుకున్నాడని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బైటాయించారు. అయితే ఆరోపణలను వైద్యులు ఖండించారు. ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో చిన్నారికి హఠాత్తుగా ఫిట్స్‌ రావడం మృతికి కారణమన్నారు. అనంతరం గుండెకు సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హాస్పిటల్‌ ఏఓ పి.సత్యనారాయణ తెలిపారు.

➡️