నరసరావుపేటలో ఆపరేషన్‌ గరుడ

Mar 22,2025 00:39

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆపరేషన్‌ గరుడలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మెడికల్‌ షాపులు, ఏజెన్సీలపై ఈగల్‌ టీం ఐజి, విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌, పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పల్నాడు రోడ్డులోని మెడికల్‌ షాపులు, బరంపేటలోని భవ్యశ్రీ మెడికల్‌ ఏజెన్సీలలో తనిఖీలు చేశారు. భవ్యశ్రీ మెడికల్‌ గోడౌన్‌లో అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఔషధాలు నిల్వ ఉంచినట్లు గుర్తించి సీజ్‌ చేశారు. తనిఖీల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్‌ ఏఈ శివన్నారాయణ, ఎఫ్‌ఆర్‌ఒ సైదులు పాల్గొనగా నరసరావుపేట రూరల్‌ సిఐ రామకృష్ణ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మత్తు కలిగించే ఔషధాలను వైద్యుల ప్రిస్‌క్రిప్షన్‌ లేకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై గుంటూరు, తెనాలిలోని పలు దుకాణాలపై పోలీసులు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. గుంటూరులోని రెండు దుకాణాల్లో, తెనాలిలోని ఒక దుకాణంలో వైద్యుల అనుమతి లేకుండా మందులు విక్రయించినట్టు గుర్తించారు. మత్తు కలిగించే ఆల్ఫాజోలమ్‌ వంటి ట్యాబ్‌లెట్స్‌ కొంత మంది యువకులు ఇటీవల విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్టు వార్తలు రావడంతో ఈగల్‌ విభాగం ఐజి ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించారు.

➡️