వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా.పి.వి.సత్యనారాయణ
ఉత్తరకోస్తా జిల్లాల పరిశోధన, విస్తరణ మండలి సమావేశాలు ప్రారంభం
ప్రజాశక్తి-విజయనగరం : విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తి పెరిగేందుకు మరింతగా వీలుంద ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.వి.సత్యనారాయణ అన్నారు. ఉత్తరకోస్తాలోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వ్యవసాయ పరిశోధన, విస్తరణ మండలి రెండు రోజుల సమావేశాలు సోమవారం విజయనగరం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు ఈ సమావవేశాలు జరుగనున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా.పి.వి.సత్యనారాయణ ప్రారంభోపన్యాసం చేస్తూ ఉత్తరకోస్తాలోని ఈ నాలుగు జిల్లాల్లో వ్యవసాయ యాజమాన్య పనుల్లో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని, విశ్వవిద్యాలయం నుంచి మంచి రకాలు వచ్చాయని తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తి పెరిగేందుకు మరింతగా వీలుందన్నారు. మొక్కజొన్న వంటి పంటల్లో ఇంకా వృద్ధి సాధించవలసి వుందని పేర్కొన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ అభ్యుదయ రైతుల పొలాల్లో మినీకిట్లు, ప్రదర్శన కేంద్రాలు, పరిశీలనలు రైతుల భాగస్వామ్యంతో ఇంకా పెరగాలన్నారు. రైతాంగం రైతు సేవాకేంద్రాలను మరింతగా ఉపయోగించుకోవాలన్నారు. నైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భరతలక్ష్మి మాట్లాడుతూ చెరుకుపంట ఇంకా వాణిజ్య పంటగా వుంటూనే నువ్వులలో కలుపు యాజమాన్యం గురించి రైతాంగం గుర్తించాలన్నారు. నాబార్డు డిడిఎం నాగార్జున మాట్లాడుతూ యువత వ్యవసాయంలో వుండాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పెరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి త్రినాధస్వామి మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. వరి, అపరాలు, నూనెగింజలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, మెట్ట వ్యవసాయం, కలుపుశాస్త్రం, యాంత్రీకరణ తదితర అంశాలపై ప్రధాన శాస్త్రవేత్తలు రైతుల నుంచి వచ్చిన ప్రశ్నలకు వారి సందేహాలను నివృత్తి చేశారు. విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు మాట్లాడుతూ ప్రాథమిక రంగమైన వ్యవసాయం ద్వారా అధికోత్పత్తి రావాలన్నారు. అభ్యుదయ రైతులు మాట్లాడుతూ అనుబంధ కార్యక్రమాలైన మేకలు, పాడిపశువుల పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్నట్టు తెలిపారు. రెండో రోజున నాలుగు జిల్లాలకు చెందిన ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల అధికారులు విస్తరణ కార్యక్రమాలపై చర్చలో పాల్గొంటారు.