ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో జాబ్ మేళా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ మేళాలో అనేక సంస్థలు పాల్గొని విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపిక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడం చాలా అవసరమని, జాబ్ మేళాలు యువతకు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న కృషి మెచ్చుకోదగినదని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్డీవో జాన్ ఇర్విన్ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య వారధిగా ఈ జాబ్ మేళా పనిచేస్తుందని అన్నారు. డిఇఓ భరద్వాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి ఈ విధమైన మేళాలు అవసరమని, ఇది మంచి అవకాశమని అన్నారు. జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి జే రవితేజ మాట్లాడుతూ ఎపి ఎస్‌ఎస్‌డిసి ద్వారా వివిధ సంస్థలు విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయని, యువత తగిన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. సి డాప్ జేడీఎం రజనీకాంత్ మాట్లాడుతూ అన్ని వర్గాల యువతకు ఇలా జాబ్ మేళాల వంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చాలా అవసరమని అన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె ఉషారాణి మాట్లాడుతూ తమ కళాశాలలో ఇలాంటి కార్యక్రమం జరగడం గర్వంగా ఉందని, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 20 కంపెనీలు పాల్గొనగా 464 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 188 మంది సెలెక్ట్ అవగా వారిలో 48 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది, ఏపీ ఎస్‌ఎస్‌డిసి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
