ప్రజా సమస్యలే మా అజెండా : కెఎస్‌ లక్ష్మణరావు

Feb 8,2025 23:39

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కెఎస్‌ లక్ష్మణరావు తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
సమస్యల పరిష్కారానికి పోరాడే శక్తులకు మండలి వేదికగా, బయటా పిడిఎఫ్‌ అండగా ఉంటుందని, ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. శనివారం స్థానిక గీతా రీజెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈనెల 10న నామినేషన్‌ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఉదయం 10 గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ, అనంతరం 12 గంటల నుండి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పిడిఎఫ్‌ పోషిస్తున్న నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కొనసాగిస్తామని చెప్పారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన నాటి నుండి 14 మంది పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు గెలుపొంది, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, ఇతర బాధిత వర్గాల సమస్యల పరిష్కారానికి అత్యంత నిజాయతీగా కృషి చేస్తున్నామని చెప్పారు. మండలి ఆయా వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు, బయట జరిగే పోరాటాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొంటూ మద్దతు ఇస్తున్నామన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ గుంటూరు ఛానల్‌, వరికెపుడిశెల, కౌలు రైతుల సమస్యలు, పట్టణాల్లో మౌలిక వసతులు వంటి అనేక అంశాలపై నిరంతరం పోరాడుతున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో టీచర్లు, గ్రాడ్యుయేట్ల సమస్యలపై ప్రాతినిధ్యం కోసం ఏర్పాటు చేసిన టీచర్స్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ రాజకీయ పార్టీలు నేరుగా పోటీ చేస్తున్నాయన్నారు. తాను ప్రజా సమస్యల సమస్యలకు మండలిలో గొంతుకగా ఉంటానని, తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నామినేషన్‌ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో యూటిఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ హనుమంతరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్‌, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ నాయకులు కుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, మేధావుల ఫోరం నాయకులు అవధానుల హరి, ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ, తదితరులు పాల్గొన్నారు.

➡️