కలెక్టరేట్ వద్ద నిరసన.. మానవహారం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో తలపెట్టిన శాంతియుత ధర్నాకు వెళ్లనీయకుండా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులను, కార్యకర్తలను అత్యంత నియంత్రత్వంగా నిర్బంధించడం, అక్రమ అరెస్టులకు పాల్పడడంతో అంగన్వాడీలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ, సెక్టార్ మీటింగ్‌ను బహిష్కరించి అంగన్వాడీలంతా సోమవారం పెద్దఎత్తున కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం నియంతృత్వ చర్యలు మానుకొని వేతనాలు పెంచాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్.అనసూయ మాట్లాడుతూ విజయవాడలో ధర్నాకు ఎవరూ వెళ్లకుండా సెక్టార్ మీటింగ్‌లు నిర్వహించాలని ఐసిడిఎస్ అధికారులు ఆదేశించడం ద్వారా అంగన్వాడీలపై తీవ్ర ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడ వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గత ప్రభుత్వాధికారులతో జరిగిన రాతపూర్వక ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని కోరారు. మహిళా దినోత్సవం రోజున అంగన్వాడీలకు తీపికబురు అని చెప్పి మోసపూరిత గ్రాట్యూటీ జిఒ ఇచ్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోనే ఈ జీవో ఇచ్చారని, అందుకు యూనియన్ అంగీకరించకపోవడంతో కార్యకర్తకు 1,40,000, హెల్పర్‌కు రూ.60వేలు గ్రాట్యూటీ చెల్లించే విధంగా అధికారులతో ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు, మట్టి ఖర్చులు రూ.20వేలు అమలు చేయాలని, నూతన విద్యా విధానంలో భాగంగా పిపిఇ 1, పిపిఇ 2 పేరుతో సెంటర్లను బలహీనపరిచే కుట్రలను ఆపాలని, బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని, ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు, బిల్లులు, అద్దెలు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెకు కూడా వెనకాడబోమని తెలిపారు. అంగన్వాడీల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మద్దతు తెలిపారు. బాబు గ్యారెంటీలకు ఏ ష్యూరిటీ లేదని, హామీలన్నీ గాలి మూటలేనని ఎద్దేవా చేశారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఐసిడిఎస్ లో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సర్వీస్ అందిస్తున్న లక్షలాదిమంది మహిళలకు ఎందుకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాన్ని ఖండించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శంకర్రావు, కె.సురేష్, నాయకులు బి.సుధారాణి, ఎ.జగన్మోహన్‌రావు, ఉపాధ్యక్షులు టివి రమణ, బి.సూర్యనారాయణ అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే భవిష్యత్తులో కార్మిక ,ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కావలసి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ కూడలిలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు, సెక్టర్ లీడర్లు, మినీ వర్కర్లు, వర్కర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
