పడకేసిన జలజీవన్‌ మిషన్‌ పథకం

జలజీవన్‌ మిషన్‌

నిధులు మంజూరు చేసినా జరగని నిర్మాణ పనులు

బిల్లులు చెల్లించలేదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

అమలుకు నోచుకోని ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు

ప్రజాశక్తి-రోలుగుంట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య నిధులతో నిర్మిస్తున్న జలజీవన్‌ మిషన్‌ పథకం పనులు అధికారుల నిర్లక్ష్యం వల్ల పడకేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేసి సురక్షిత తాగునీరు పంపిణీ చేయాలనే సదుద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేయ సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వం వాటాగా 80శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 20శాతం వాటా నిధులను సమకూరుస్తూ, రోలుగుంట మండలంలోని 24 పంచాయతీ గ్రామాలకు మొదటి విడతలో రూ.11 కోట్లను, రెండవ విడత రూ.15 కోట్ల మంజూరు చేశారు. ఆయా నిధులతో కొన్ని గ్రామాలకు కుళాయిలు ఏర్పాటు చేశారు. వాటర్‌ ట్యాంకులు మాత్రం ఒక్కటే నిర్మాణం పూర్తి కాలేదు. వి.శరభవరం, కొవ్వూరు, బిబి.పట్నం, కసిరెడ్డిపాలెం, జానకిరాంపురం గ్రామాల్లో వాటర్‌ ట్యాంక్‌ల నిర్మాణం పూర్తిగా కాలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదని చేతులెత్తేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అయినా మంజూరైన ట్యాంక్‌ నిర్మాణం పూర్తి చేసి, ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

అసంపూర్తిగా ఉన్న జానకిరాంపురం వాటర్‌ ట్యాంక్‌

➡️