ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రముఖ చిత్రకారుడు, సీనియర్ జర్నలిస్టు, సత్తెనపల్లి వాసి జింక రామారావు (76) శుక్రవారం సాయంత్రం మరణించారు. రామారావు గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించగా ఆయన భౌతికకాయాన్ని పలువురు పట్టణ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఫోన్ ద్వారా రామారావు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. రామారావు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందారు. రామారావుకు చిన్ననాటి నుండి బొమ్మలు వేయడం పట్ల ఆసక్తి చూపడంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల నుండి మరింత ప్రోత్సాహం లభించింది. దీంతో బొమ్మలు వేయడంలో మరింత ఆసక్తి పెంచిన రామారావు అర్ధవంతమైన చిత్రాలు వేయడంతోపాటు వాటిని ప్రదర్శనకు ఉంచేవారు. సత్తెనపల్లిలో రమణా స్టూడియో పేరుతో ఒక స్టూడియోను నిర్వహిస్తూ ఫొటోగ్రాఫర్‌గా, చిత్రకారునిగా స్థిరపడ్డారు. మూడు దశాబ్దాలు పత్రికా విలేకరిగా పని చేశారు. ఆయన వేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి పుస్తకంలోని పద్యాలకు అనుగుణంగా ఆయన వేసిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ప్రముఖ సంస్థల నుండి సత్కారాలు, అవార్డులు అందుకున్నారు. అభ్యుదయ కళాపరిషత్ వారి నుండి ‘చిత్రకళా ప్రవీణ్’ అవార్డు, 2017లో అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి సన్మానం, సినీ నటులు బ్రహ్మానందం నుండి సన్మానం, 2017లో టాటా ఫవర్ వారి నుండి న్యూఢిల్లీలో సన్మానం, 2019లో న్యూఢిల్లీలో మీడియా 24/7 వారి నుండి ‘భారత సమాజరత్న’ అవార్డులు పొందారు.
పలువురి సంతాపం
రామారావు భౌతికకాయాన్ని శనివారం పలువురు సందర్శించి నివాళులర్పించారు. వీరిలో ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య ,పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు కట్టా శివదుర్గారావు, అనుముల వీరబ్రహ్మం, సీనియర్ ఫొటోగ్రాఫర్ గంగారపు వెంకట రావు, వైసిపి నాయకులు చలంచర్ల సాంబశివరావు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఆయన మృతికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ సంతాపాన్ని తెలిపారు. సంతాపం ప్రకటించిన వారిలో పద్మశ్రీ డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం, సత్తెనపల్లి న్యూస్ పత్రిక ఎడిటర్ మారూరి పుల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ నందా సాంబశివరావు, గంగారపు వెంకట్రావు, బిట్రా వేదాద్రి, టిపి కల్యాణరావు, ఉల్లం శేషగిరిరావు, ఎం.లింగారెడ్డి, జి.రంగా రావు, డాక్టర్ పరశురామయ్య, డాక్టర్ జి.విజయసారధి, డాక్టర్ కిరణ్ కుమార్, సిహెచ్ పెంచలరెడ్డి, పివి మురళి కిషోర్, జి.వేణుగోపాల్, జి.అమర్‌నాథ్ ఉన్నారు.