ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : ఈ.ఎమ్.డి.పి వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయ ఉన్నత పాఠశాల రామచంద్రపురం లో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి ఈ.ఎమ్.డి. పి ఎక్స్ పో లో అమలాపురం మండలం పాలగుమ్మి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి ఎక్స్ పో కు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుంట్రు వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు వరుసగా 3సార్లు జిల్లా స్థాయికి ఎంపికయ్యి హ్యాట్రిక్ సాధించి వరుసగా 2వసారి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కాలవలో దొరికే గుర్రపు డెక్కలతో వివిధ రకాల కళాకృతులు తయారు చేయడం, వాటితో కంపోస్టు తయారు చేసి సేంద్రియ పద్ధతులతో మంచి ఫలదాయం కాయించడం, పర్యావరణం కలుషితం కాకుండా కాపాడడం వంటి ప్రాజెక్ట్ ను వీరు తయారు చేశారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా గైడ్ టీచర్ ఏ.బి చంద్రావతి, ఎస్. ఏ (బి.ఎస్ ), విద్యార్థులు ఏ.ఎస్.ఎల్. వి. నాగేశ్వరరావు (9వ తరగతి), సిహెచ్. వెంకట రామ తేజ(9వ తరగతి)లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. అలాగే గ్రామ సర్పంచ్ కుడిపూడి రామలక్ష్మి,ఎంపీటీసీ పాలగుమ్మి విజయ,పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కాట్రు మురళీకృష్ణమోహన్, కమిటీ సభ్యులు తదితరులు వీరిని అభినందించారు.
