పల్నాడు ఎస్‌పి సస్పెన్షన్‌

May 16,2024 23:58

ఎస్పీ బిందుమాధవ్‌, కలెక్టర్‌ శివశంకర్‌, డీఎస్పీ బిఎస్‌ఎన్‌ వర్మ, డీఎస్పీ పల్లపురాజు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున, అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణలు, హింస ప్రజర్విల్లడంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కన్నెర్ర చేసింది. అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌) ఏర్పాటు చేసి తక్షణం బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లను అప్‌డేట్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దిశానిర్ధేశం చేసింది. అల్లర్లను నియంత్రించడంలో విఫలమైన పల్నాడు జిల్లా ఎస్‌పి గరికపాటి బింధుమాధవ్‌ను ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆదేశాలు వచ్చాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ను తక్షణం బదిలీ చేయాలని శాఖపరమైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పల్నాడు ఎస్‌పిగా బిందుమాధవ్‌ గతనెల 4న నియమితులయ్యారు. 5న బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అప్పటి ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిని బదిలీ చేసి బింధుమాధవ్‌ను ఎస్‌పిగా నియమించారు. బిందుమాధవ్‌ గతంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అదనపు ఎస్‌పిగా పనిచేసి తొలిసారిగా పల్నాడు జిల్లా ఎస్‌పిగా నియమితులయ్యారు. ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన 40 రోజులకే సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందుకోవం రాష్ట్రచరిత్రలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌పై బదిలీ వేటు పడింది. ఆయనపైనా శాఖపరమైన విచారణకు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులిచ్చింది. 2022 ఏప్రిల్‌ 4న పల్నాడు జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శివశంకర్‌ రెండేళ్లపాటు ఇక్కడే కొనసాగారు. ఎన్నికల సందర్భంగా కొన్ని బదిలీలు జరిగినా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. నర్సరావుపేట డిఎస్‌పి బిఎస్‌ఎన్‌ వర్మ, గురజాల డిఎస్‌పి పల్లపురాజు, ఎస్‌బి సిఐ బాలనాగిరెడ్డి, సిఐ ప్రభాకరరావు, కారంపూడి ఎస్‌ఐ రామాంజనేయులు, నాగార్జున సాగర్‌ ఎస్‌ఐ కొండారెడ్డిని సస్పెండ్‌ చేసి వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత ఇప్పటి వరకు గుంటూరు రేంజి ఐజి పాలరాజు, పల్నాడు ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిని గతనెల 2వ తేదీన బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత పల్నాడు జిల్లాలో పలువురు సిఐలు, ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈసారి ఏకంగా ఎస్‌పితోపాటు ఇద్దరు డిఎస్‌పిలు, మరో ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్‌ఐలను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా కేంద్ర బలగాలను పంపినా, ముందుగానే నాలుగు నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినా దిగువ స్థాయి అధికారులు సమర్ధవంతంగా పనిచేయలేకపోయారని ఈసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డిజిపి హరిష్‌కుమార్‌ గుప్తాతో సమీక్ష అనంతరం ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలకు ఉపక్రమించిందని అధికార వర్గాలు తెలిపాయి.

➡️