పల్నాడు అల్లర్లపై పూర్తిస్థాయి విచారణ చేయండి – లావు శ్రీ కృష్ణ దేవరాయలు

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి:పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నరసరావుపేట ఎంపి లావు శ్రీకఅష్ణదేవరాయలు డిమాండ్‌ చేశారు. గుంటూరు విద్యానగర్‌లో టిడిపి మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. పల్నాడులో 85 శాతానికిపైగా పోలింగ్‌ జరగడంతో వైసిపి తట్టుకోలేకపోతుందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అల్లర్లను ఒక అస్త్రంగా ఎంచుకుందని ఆరోపించారు. వైసిపి దాడుల్లో గాయపడిన వారిలో 75 శాతం మందికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. కేవలం టిడిపి తరఫున ఏజెంట్లుగా ఉండటం, ఓట్లు వేయడం వల్లే వారిపై దాడి చేశారని విమర్శించారు. ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్‌ఐలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం అధికార దుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు. వైసిపి నేతలు, పోలీస్‌ అధికారుల ఫోన్‌ కాల్‌ డేటాను సిట్‌ అధికారులు పరిశీలించి వాస్తవ దోషులను గుర్తించాలని కోరారు. మాచర్ల నియోజకవర్గంలో దాడులకు వైసిపి అనుకూల పోలీసు అధికారులే కారణమని విమర్శించారు. పల్నాడు జిల్లాలో 150 పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు జరుగుతాయని ముందుగానే చెప్పినా పోలీసులు స్పందించలేదన్నారు. సిట్‌ అధికారులు దీనిపైనా విచారణ జరపాలని కోరారు. గొడవలు జరిగినా పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఎవరితో ఫోన్లు మాట్లాడారో సిట్‌ అధికారులు విచారణ జరపాలని కోరారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పిన్నెల్లి హింసను ప్రేరేపించిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.

➡️