- సీమంతం వేడుకల తర్వాత దుర్ఘటన
ప్రజాశక్తి- రాజుపాలెం (పల్నాడు జిల్లా) : సీమంతం వేడుకలో అప్పటివరకు బంధుమిత్రులందరితో సంతోషంగా గడిపారు. కొద్ది రోజుల్లో తమ కుటుంబంలోకి మరొకరు బిడ్డ రూపంలో వస్తారనే ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నారు. మరలా బిడ్డ పుట్టాక వస్తామంటూ బంధువులకు చెప్పి బయలుదేరిన వారిని లారీ రూపంలో మృత్యువు కభళించింది. కారును లారీ ఢకొీనడంతో తల్లి, ఆమె ఇద్దరు కుమారులు దుర్మరణం చెందారు. పల్నాడు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం…. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన షేక్ నజీమా (50), కుద్దూస్ దంపతులకు ఇద్దరు కుమారులు నూరుల్లా (26), షేక్ హాబీబుల్లా (24) ఉన్నారు. నూరుల్లాకు ఏడాది కిందట వివాహమైంది. కోడలు సీమంతాన్ని సజీమా దంపతులు హైదరాబాదులో బంధుమిత్రుల నడుమ ఘనంగా నిర్వహించారు. వేడుక ముగించుకొని నజీమా, ఇద్దరు కుమారులు స్వగ్రామమైన పెద్దకొత్తపల్లికి కారులో బయలుదేరారు . అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై నెమలి పురి గ్రామంలోని లక్ష్మీ తిరుపతమ్మ గుడి వద్ద వీరి కారును నెల్లూరు నుండి పల్నాడు జిల్లా దాచేపల్లిలోని సిమెంటు ఫ్యాక్టరీకి వెళ్తున్న ట్యాంకర్ (లారీ) ఢకొీట్టింది. ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా డివైడర్‌కు ఢకొీట్టి రాంగ్‌రూట్‌లోకి వెళ్లి కారును ఢకొీ నడంతో నజీమా, హాబీబుల్లా అక్క డిక్కడే మృతి చెందారు. కారును నడుపుతున్న నూరుల్లా తీవ్రంగా గాయపడ్డారు. 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో చేయి విరిగిన లారీ డ్రైవర్ నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలిని పల్నాడు జిల్లా ఎస్‌పి కె.శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. సత్తెనపల్లి రూరల్ సిఐ ఎంవి సుబ్బారావు, రాజుపాలెం ఎస్‌ఐ వేణుగోపాల్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నూరుల్లా సాఫ్‌వేర్ ఉద్యోగి. హబీబుల్లా వైజాగ్‌లో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు.