జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్..
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దేశ, రాష్ట్ర ప్రయోజనాలు, కార్మిక, కర్షక, బడుగు, బలహీన, అనగారిన వర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే నెల 6,7,8 తేదీలలో నరసరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్ లోని షాదీఖానాలో జరగనున్న సిపిఎం 25 వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం జిల్లా మహా సభల ప్రారంభ సూచికగా 6 వ తేదీన పల్నాడు నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని కోట సెంటర్ నుండి పల్నాడు బస్టాండ్ వరకు ప్రదర్శన అనంతరం పల్నాడు బస్టాండ్ నందు జరుగు బహిరంగసభను జయప్రదం చేయాలన్నారు. ప్రధాన వక్తలుగా సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పెనుమల్లి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు వి. క్రిష్ణయ్య, హరి కిషోర్ తదితరులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలతో దేశానికి, రాష్ట్రానికి వాటిల్లే నష్టాలు ఆయా సమస్యలు పరిష్కారానికి సిపిఎం కర్తవ్యం, చేపట్టాల్సిన పోరాటాలు, తీర్మానాలు, కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.
కార్మిక, రైతు, విద్యార్ధి, మహిళ, ఉద్యోగ, యువత ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని ప్రజా ప్రతినిధుల ముందు లేవనెత్తి పరిష్కారానికి సిపిఎం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. దోపిడీ వర్గ రాజకీయలను అంతమొందించడం సిపిఎం ద్వారానే సాధ్యమన్నారు.
కేంద్రంలో వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక, వ్యవసారంగాలను దివాలా తీశాయన్నారు. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందన్నారు. ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని, దేశ ప్రజలు చెమటోడ్చిన కష్టంతో చెల్లించిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదాని లాంటి బడా కార్పోరేట్ సంస్థలకు అప్పనంగా అమ్మేస్తున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై, ప్రజల హక్కులపై, రాష్ట్రాల హక్కులపై, రాజ్యంగంపై దోపిడీ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రభుత్వ రంగ రక్షణకై సిపిఎం ఉద్యమిస్తుందన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తుందని అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం సిపిఎం పోరాడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, రాష్ట్రాభివృద్ధికై, అలుపెరగక అనేక సమరశీల పోరాటాలు ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో ప్రతి పేదవాడికి కూడు, గూడు కోసం, నకిలీ విత్తనాలు భారిన పడి నష్టపోయిన రైతులు పక్షాన అదేవిధంగా రైతుల వద్ద నుండి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసిన దళారులు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిన వారిపై రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశామన్నారు. జిల్లాలో త్రాగు, సాగు నీటి అవసరాలు తీర్చే వరికపూడిశెల ప్రాజెక్టు సాధనకు వరికపూడిశెల జల సాధన సమితి ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం చేశామని జిల్లా సమగ్రాభివృద్దికై నిధులు కేటాయించాలని పోరాడిందన్నారు. ప్రజా పోరు ప్రచార యాత్ర ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించామని చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేసిన పార్టీ సిపిఎం మాత్రమేనన్నారు. మైనింగ్ నిక్షేపాలు పేరిట నాటి నేటి ప్రభుత్వాల తీరుతో భూములు కోల్పోయిన యడవల్లి రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, రైతాంగ, కార్మిక సమస్యలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజల సమస్యల పరిష్కార మార్గాల పట్ల స్పష్టమైన అవగాహనతో సిపిఎం పోరాటాలు సాగిస్తుందన్నారు. సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పోరాటాలకు ప్రజలు మద్దతు తెలపాలని తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.