పంచాయతీ రికార్డులు మాయం

Oct 2,2024 21:51

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని గుణుపూరుపేట సచివాలయంలో ముఖ్యమైన పంచాయతీ రికార్డులు మాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రికార్డులు పోవడానికి పంచాయతీ కార్యదర్శి బి.లక్ష్మణరావు నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. రికార్డులు పోయి రెండు నెలలు కావస్తున్నా పైఅధికారుల దృష్టికి తీసుకురాకపోగా, పంచాయతీ బాడీ అనుమతి లేకుండా మరో రెండు పుస్తకాలు కొత్తగా ఏర్పాటు చేసి తీర్మానాలు చేస్తున్నారు. సుమారు 45 రోజులు తరువాత కూడా పై అధికారులకు చెప్పకుండా కార్యదర్శి లక్ష్మణరావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు పోయినట్టు ఫిర్యాదు చేశారు. దొంగే.. దొంగ దొంగ అనే చందంగా ఈ వ్యవహారం కనిపిస్తుండటంతో మండలంలో చర్చనీయాంశమైంది.గుణుపూరుపేట సచివాలయంలో 2021లో ఏప్రిల్‌లో సమావేశపు పుస్తకాన్ని, అజెండా పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వాటి మీద తీర్మానాలు చేస్తూ ఉండేవారు. ఆ రికార్డులను సచివాలయంలో ఉన్న బీరువాలో పెట్టి ఉంచేవారు. ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీన తీర్మానం చేయడానికి ఆ రికార్డులను బీరువాలోని నుంచి తీయడానికి చూసేసరికి అందులో ఆ పుస్తకాలు లేవు. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పలేదు. కనీసం పంచాయతీ సర్పంచ్‌కు కూడా చెప్పకుండా కార్యదర్శి ఒక్కడే పోలీస్‌ స్టేషన్‌కు గత నెల 29వ తేదీన వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఈ నెల ఒకటిన ఇఒపిఆర్‌డి శంకర్‌ జగన్నాథం ద్వారా ఎంపిడిఒకు రికార్డులు పోయినట్టు ఫిర్యాదు చేశారు. దీంతో రికార్డులు మాయమైన సంగతి బయటపడింది.

ఎవరి అనుమతీ లేకుండానే రికార్డులు

రికార్డులు మాయమైనప్పటి నుంచి పంచాయతీలో తీర్మానం కోసం పంచాయతీ బాడీ, ఇఒపిఆర్‌డి, ఎంపిడిఒ వీరి అనుమతి లేకుండా రికార్డుల ఇష్టానుసారంగా రాసి తీర్మానాలు చేసేస్తున్నట్లు తెలిస్తోంది. వాస్తవానికి రెండు నెలల క్రితం రికార్డులు మాయమైతే సంబంధిత కార్యదర్శి స్థానిక సర్పంచ్‌తో పాటు అధికారులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వాలి. కానీ ఎవరికీ చెప్పకుండా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం పట్ల కార్యదర్శిపై పలు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఆయనే కావాలని రికార్డులను మాయం చేసి ఇలా నాటకం ఆడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శిపై గతంలోనూ ఆరోపణలులక్ష్మణరావు గ్రేడ్‌ 4 కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో డిపిఒ ఆఫీసులో పని చేసేవారు.. అప్పుడు బదిలీల్లో సుమారు 18 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణ ఉంది. దీంతో అప్పుడు బదిలీపై గుణుపూర్‌పేట కార్యదర్శిగా వచ్చేశారు. గతంలో పనిచేసిన వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి జీతాలు పెట్టేవాడు కాదని, వారిని నానా ఇబ్బందులు పెట్టేవారని వారందరూ మండల స్థాయి అధికారులకు విన్నవించుకున్న సందర్భాలూ ఉన్నాయి. తనకు అధికారులతో సంబంధం లేదని, ప్రజాప్రతినిధుల అండ దండలు ఉంటే చాలని కార్యదర్శి బహిరంగంగానే చెబుతున్నట్లు గ్రామస్తులతో పాటు తోటి ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒకటి రెండు రోజుల్లో తాను ఇక్కడ నుంచి వేరే గ్రామానికి బదిలీపై వెళ్లిపోతున్నానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని చెబుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

రికార్డులు పోవడం వాస్తవమే..

గునుపూర్‌పేట పంచాయతీ ఆఫీసులో రికార్డులు పోవడం వాస్తవమే. 45 రోజుల క్రితం రికార్డులు పోతే ఇప్పుడు నా దృష్టికి తీసుకురావడం తప్పే. అనుమతి లేకుండా మా దృష్టిలో పెట్టకుండా తీర్మానం రికార్డు ఏర్పాటు చేయడం కూడా తప్పే. కార్యదర్శి బి. లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదును ఎంపిడిఒకు పంపించాను. పై అధికారుల సూచనలు మేరకు చర్యలు తీసుకుంటాం.

శంకర్‌ జగన్నాథం, ఇఒపిఆర్‌డి, డెంకాడ.

➡️