ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లా పరిషత్‌లో పనుల పందేరం నడు స్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎఫ్‌ఎసి చైర్‌పర్సన్‌గా ప్రొద్దుటూరు జడ్‌పిటిసి శారద వ్యవహరిస్తున్నారు. జడ్‌పి చైర్మన్ రాజీనామా చేసిన ఆర్నెళ్లలోపు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు కొత్త చైర్మన్ ఎన్నిక వ్యవ హారాన్ని పూర్తి చేయాల్సి ఉంది. వైసిపి ఐదేళ్ల పాలనలో ఎటువంటి లబ్ధిపొందని జడ్‌పిటిసిలు తీవ్ర అసంతృప్తి సెగలతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అసంతృప్తులను చల్లబరచడంలో భాగం గానే అభివృద్ధి పనుల పందేరాన్ని తెరపైకి తెచ్చారనే చర్చ నడుస్తోంది. ఇటీవలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఒ జనరల్ ఫండ్స్ కింద సుమారు రూ.ఎనిమిది కోట్ల మేర నిధులు ఉన్నాయని, అభివృద్ధి పనులకు కేటాయిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. రానున్న ఆర్నెళ్ల వ్యవధిలో చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యం ఉత్కంఠను కలిగిస్తోంది. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో జడ్‌పి చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో వైసిపి జడ్‌పిటిసిల్లో నెలకొన్న అసంతృప్తి సెగలు ఎక్కడ దెబ్బ తీస్తా యోననే భయంతో పనుల పందేరానికి తెరతీ సినట్లు సమాచారం. ఉమ్మడి కడప జిల్లాలోని 51 మంది జడ్‌పిటిసిలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రూ.5.10 కోట్లు కేటాయించినట్లు తెలు స్తోంది. పలువురు జడ్‌పిటిసిలు ఏయే పనులకు ఏమేరకు కేటాయింపులనే అంశంపై జిల్లా పరిష త్‌కు చేరుకుని చేర్పులు, మార్పులు చేసుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఐసిడిఎస్ డిపార్టుమెంట్ పరిధిలోని అంగన్వాడీ భవన నిర్మాణాలు, గ్రావెల్ రోడ్లు ఇతర పనులకు సంబంధించిన పనులపై పలువురు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జడ్‌పి జనరల్ ఫండ్స్ కేటాయింపు వ్యవహారం ఇలా ఉండగా జనరల్ ఫండ్స్ ఉన్నంత మాత్రానా సరిపోదని, ప్రభుత్వ అఫ్రూవల్ పొందిన అనంతరం నిధులు ఖాతాలో జమపడాల్సి ఉందని, తమ ప్రభుత్వ హయాంలో ఇటువంటి సమస్య నెలకొన్న కారణంగానే ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేక పోయామనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన నేపథ్యంలో వైసిపి జడ్‌పిటిసిలు పనులు చేయడంతోనే సరిపోదని, చేసిన పనులకు సంబం ధించిన చెల్లింపుల సమస్యను ఎదుర్కొనాల్సి వస్తుందనే హెచ్చరికలు వినిపిస్తుండడం గమనార్హం.
