పర్సా ఆశయాలు ముందుకు తీసుకుపోవాలి

Jun 8,2024 20:57

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : సమరశీల కార్మికోద్యమాన్ని కాపాడడంలోనూ, రాష్ట్రంలో సిఐటియు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పర్సా సత్యనారాయణ ఆశయాలను కార్మికవర్గం ముందుకు తీసుకుపోవడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. స్థానిక స్థానిక సుందరయ్య భవనంలో పర్సా సత్యనారాయణ శతజయంతోత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, కోశాధికారి గొర్లె వెంకటరమణ, మధ్యాహ్నం భోజనం పథకం సంఘం జిల్లా కార్యదర్శి వై,శాంతి కుమారి, సిఐటి నాయకులు గవర వెంకటరమణ తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మన్మధరావు మాట్లాడుతూ పర్సా జీవిత ఆరంభం ఉద్యమ కెరటాల్లో ఆవిర్బవించిందన్నారు. సింగరేణిలో అగ్నిజ్వాల రగిలించింది, నైజాం రజాకార్లను ఎదిరించి తీవ్ర నిర్బంధానికి గురయ్యారని పేర్కొన్నారు. డెత్‌ వారెంట్‌తో కాల్చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, కానీ ఔరంగాబాద్‌ జైలుకు తరలించి, చీకటి గదిలో బంధించారన్నారు. జైలు బాత్రూం గోడకు కన్నం పెట్టి తప్పించుకుని, అనేక కష్టాలతో ప్రయాణించి వరంగల్‌ దళాల్లో తిరిగి చేరారన్నారు. పర్సా జీవితంలో సుమారు 9ఏళ్లకు పైగా జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. 1966లో ఎమ్మెల్యే పదవికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం సందర్భంగా రాజీనామా చేశారన్నారు. 1970 సిఐటియు ఆవిర్భావం నుంచి 2002 వరకు రాష్ట్ర అధ్యక్షులుగా, అఖిలభారత ఉపాధ్యక్షులుగా పని చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మికు ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం ఎర్రబావుటా కింద రెపరెపలాడడానికి బీజాలు నాటారని, వర్గ పోరాట సిద్ధాంతాన్ని అమలు చేయడానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. పర్సా జీవితం వ్యక్తిగతంగా అత్యంత నిరాడంబరం, ఎమ్మెల్యేగా పనిచేసిన, ఉన్నత స్థాయిలో ఉన్న, ఒక్క సెంటు భూమి గానీ, చిన్న ఇల్లు గాని సంపాదించుకోలేదని, ఎమ్మెల్యే అలవెన్స్‌ చనిపోయే వరకు పార్టీకి జమ చేశారని, కార్మిక నేతలు అనుసరించాల్సిన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం గా నిలిచారని కొనియాడారు. పర్సా జీవితం కార్మిక వర్గం తోనే ప్రారంభమైందని, ఉద్యమ జీవితం కార్మిక రంగంలోనే సాగిందని తెలిపారు. ఉద్యోగిగా ప్రారంభమైన, విప్లవోద్యమం కోసం వృత్తిని వదిలి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఓనమాలు దిద్దుకుని, బొగ్గు కార్మికులను సంఘటిత పర్చడంలో కృషిచేసి, సిఐటియు రాష్ట్ర ప్రధాన బాధ్యతల్లో సుదీర్ఘకాలం అధ్యక్షునిగా తన ఉద్యమ ప్రస్థానాన్ని సాగించి, అనేక అటు పొట్ల మధ్య సమరశీల కార్మికోద్యమాన్ని కాపాడడంలోనూ, రాష్ట్రంలో సిఐటియుని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు, కావున ఆయన సేవలను, ఆశయాలను కార్మిక వర్గం మరింత ముందుకు తీసుకుపోవాలని తెలిపారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో స్కీం వర్కర్లు పాల్గొన్నారు.

➡️