పింఛన్ల కోసంపడిగాపులు

Apr 3,2024 21:50

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెండు రోజులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు అందజేశారు. అకౌంట్లకు నగదు ఆలస్యంగా పడినందున పంపిణీలో జాప్యం జరిగిందని సచివాలయ సిబ్బంది తెలిపారు. 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కలెక్టర్‌ 4వ తేదీన పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో వచ్చిన ప్రకటన ప్రకారం 3వ తేదీనే అందుతాయని ఆశపడ్డారు. ఇదే ఆశతో ఉదయం నుంచీ వృద్ధులు, వికలాంగులు, ఒంటిరి మహిళలు ఇలా అనేక కేటగిరీలకు చెందిన పింఛను దారులు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. మండుటెండలో తీవ్ర అవస్థలు పడ్డారు. వేపాడ మండలం సింగరాయి, వల్లంపూడితోపాటు, విజయనగంలోని విటి అగ్రహారం, మెరకముడిదాం మండలం గర్భాం సహా ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది. మధ్యాహ్నం వరకు సంబంధిత సచివాలయ అకౌంట్లలో నగదు జమకాలేదు. అనంతరం అకౌంట్లలో జమ అయినట్టు మెసేజ్‌లు రావడంతో సంబంధిత బాధ్యులు హుటాహుటిన బ్యాంకులకు వెళ్లి నగదు తెచ్చారు. అనంతరం లబ్దిదారుల బయోమెట్రిక్‌ తీసుకుని సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేశారు. కేవలం సచివాలయాలలోనే కాకుండా, కొన్నిచోట్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. సమయం సరిపోకపోవడంతో మిగిలిన వారికి రేపు ఇస్తామంటూ చాలా చోట్ల సిబ్బంది చెప్పారు. విజయనగరం జిల్లాలో 2,83,773 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వృద్ధులు 1,47,874 మంది ఉన్నారు. ఆ తరువాత స్థానంలో వితంతువులు 65,971 మంది, వికలాంగులు 37,840మంది, వైఎస్‌ఆర్‌ అభయ హస్తం పింఛనుదారులు 10,848 మంది ఉన్నారు. మిగిలిన వారిలో కళాకారులు, చేనేత, మత్స్యకార, ట్రాన్స్‌ జెండర్‌, దీర్ఘకాలిక రోగులు ఉన్నారు. వీరందరికి నెలనెలా సుమారు రూ.82కోట్ల 93లక్షల 99వేలు జిల్లా గ్రామీణాభివృద్ధి ద్వారా సామాజిక పింఛన్ల కింద అందుతోంది. ఈ మొత్తాన్ని సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేవారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పనుల నుంచి వాలంటీర్లను మినహాయించాలని ఎన్నికల సంఘం సూచించిన సంగతి తెలిసిందే. చివరకు న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో కోడ్‌ అమల్లో ఉన్నందున వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ పట్ల టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టాలని న్యాయ స్థానం సూచించింది. దీంతో, చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంటున్నారంటూ సిఎం జగన్‌ సహా వైసిపి నాయకులు విమర్శలు చేశారు. అందుకు తగ్గట్టే రాష్ట్ర స్థాయి అధికారులు మునుపెన్నడూ లేని విధంగా రెండు రోజులు ఆలస్యంగా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. దీంతో, ఆ మేరకు ఆలస్యంగానే పింఛన్ల పంపిణీ మొదలైంది. పింఛన్ల పంపిణీలో జాప్యం పార్వతీపురం మన్యం జిల్లాలో 1,45,409 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో 22,874 మందికి పింఛన్లు బుధవారం సాయంత్రానికి పంపిణీ చేశారు. శ్రీసాలూరు మున్సిపాలిటీలో బుధవారం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్ల పంపిణీ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం మాత్రం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్లు పంపిణీ చేపడుతున్నట్లు ప్రకటించింది. కానీ బ్యాంక్‌ నుంచి నగదు సచివాలయాల అడ్మిన్లు, వెల్ఫేర్‌ కార్యదర్శులకు అందకపోవడంతో సాయంత్రం వరకు పంపిణీ కాలేదు. బుధవారం రాత్రి పది గంటల వరకైనా పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. కానీ నగదు చేరడం ఆలస్యం కావడంతో సాయంత్రం పింఛన్లు పంపిణీ చేయడానికి సచివాలయాల సిబ్బంది ఇష్టపడలేదు. చీకటి పడిన తర్వాత పింఛన్లు పంపిణీ చేస్తే ఇబ్బంది పడతామని వారు భావించి పంపిణీ ప్రారంభించలేదని తెలుస్తోంది. శ్రీవీరఘట్టం మేజరు పంచాయతీ సచివాలయం వద్ద పింఛన్లు పంపిణీ చేస్తారేమోనని పింఛనుదారులు బుధవారం ఉదయం నుండి పడిగాపులు కాశారు. సచివాలయ సిబ్బంది కార్యాలయానికి చేరుకొని ఇంటి వద్దకే వచ్చి పింఛను ఇస్తారని చెప్పడంతో వారంతా ఇంటి ముఖం పట్టారు. శ్రీ పాలకొండ మండలంలో అన్నవరంలో సచివాలయం దగ్గర పింఛనుదారులు పింఛను కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న టిడిపి మండల అధ్యక్షులు గండి రామినాయుడు పింఛనుదారులతో మాట్లాడి, వారికి మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్లు అందించారు.

➡️