ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం (పిడిఎఫ్) అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు సోమవారం నామినేషన్ దాఖలు చేయగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తదితర ప్రజా సంఘాల కార్యకర్తలు వేలాది మంది తరలి వచ్చారు. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సభలో దాదాపు 70 సంఘాల నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, యువజన నాయకులు చందు మద్దతు తెలిపారు. కెఎస్ లక్ష్మణరావుకు నామినేషన్ ఫీజును అంగన్‌వాడీ యూనియన్ నాయకులు అందచేశారు. అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి నగరంపాలెం మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ జరిగింది. తొలుత యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో కెఎస్ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పు చేస్తే తప్పని చెబుతూ, మంచి చేస్తే అభినందిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని అన్నారు. ఎన్నో ఆశలతో ప్రజలు కూటమి ప్రభుతాన్ని ఎన్నుకున్నారని, కానీ 8 నెలలకే అసంతృప్తి పెద్ద ఎత్తున వస్తోందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రాబోయే కాలంలో 15 వేల పాఠశాలలు మూతపడబోతున్నాయని చెప్పారు. నిర్బంధం పెరగుతుందన్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణరావు లాంటి నిజాయితీ పరులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చట్ట సభలలో బడా కోటీశ్వరులు పెరిగిపోయారని, మన కోసం మనమే చట్టాలు చేసుకోవాలని చట్ట సభలను కూడా ఆక్రమించారన్నారు. దీంతో ప్రజా సమస్యలు వారు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. చట్ట సభల్లో ప్రజల కోసం నిలబడే వ్యక్తి లక్ష్మణరావు అని తెలిపారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ కెఎస్ లక్ష్మణరావు ఎన్నిక రాష్ట్రానికి చారిత్మ్రాక అవసరం అన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ల ప్రాతినిధ్యం ఉండాల్సిన సీట్లలో కూడా ఇప్పటికే కొన్నింటినీ రాజకీయ పార్టీలు ఆక్రమించాయని, మిగిలిన వాటిని ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. ప్రజల గొంతుక మండలిలో వినిపించటానికి పిడిఎఫ్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కులం, డబ్బు వంటి ఇతర ప్రలోభాలకు లొంగకుండా ప్రజల కోసం పనిచేసే కెఎస్ లక్ష్మణరావును గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా విలువలను కాపాడుకుంటూ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు నిజాయితీగా పని చేస్తున్నామన్నారు. నిజాయితీకి ఓటర్లు పట్టం కట్టాలన్నారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ కెఎస్ లక్ష్మణరావు ఈ నియోజకవర్గానికే కాకుండా, రాష్ట్రంలో పోరాడే వారందరికీ ప్రతినిధి అని చెప్పారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయి ప్రచారంలో ఓటర్ల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. గ్రాడ్యుయేట్లు, టీచర్లు వారి ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగం కేటాయించిన స్థానాల్లోనూ రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయని చెప్పారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన నాటి నుండి 18 ఏళ్లలో 14 మంది పిడిఎఫ్ ఎమ్మెల్సీలు గెలుపొంది అత్యంత నిజాయితీతో పనిచేస్తున్నామని, భవిష్యత్‌లోనూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి చీష్టీ, ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అసోసియేషన్ నాయకులు నాగయ్య, ఐలు జాతీయ నాయకులు నర్రా శ్రీనివాసరావు, జిల్లా నాయకులు రమేష్, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు కుమార్, జెవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు స్వాతి, సచివాలయ ఉద్యోగుల సంఘాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనురాధ, డాక్టర్ వసుంధర, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు సిహెచ్.నాగబ్రహ్మాచారి, సన్ అసోసియేసన్ నాయకులు యశ్వంత్, నర్సింగ్ అసోసియేషన్ నాయకులు స్వచ్ఛంద ప్రసాద్, జె.ఎల్.అసోసియేషన్ నాయకులు కైలాష్‌నాద్, మేధావుల ఫోరం నాయకులు అవధానుల హరి ఎల్‌ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు గాంధీ, డివైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు రవిశంకర్, ఎఐటియుసి నగర అధ్యక్షులు అంజిబాబు, యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు ఎ.ఎన్.కుసుమ కుమారి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌పి మనోహరకుమార్, కెఎ ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్, పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీనివాసరెడ్డి, ఎం మోహనరావు, బాపట్ల జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు ఎ శ్రీనివాసరావు, కె వినరుకుమార్, ఎన్‌టిఆర్‌జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీనివాసరావు, ఎ సుందరయ్య, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండి షౌకత్ హెస్సెన్, బి కనకారావు, ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్తాఫా ఆలి, ఆర్.రవికుమార్, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.
సందడిగా.. భారీ ర్యాలీగా..
నామినేషన్ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు, పిడిఎఫ్ మాజీ ఫ్లోర్ లీడర్ వి.బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీలు ఐ.వెంకేటశ్వరరావు, బి.గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ బి.నాగేశ్వరరావు తదితరులు ర్యాలీలో అగ్రభాగాన నడవగా, వేలాది మంది కార్యకర్తలు జెండాలు చేతబూని ర్యాలీలో నడిచారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, వివిధ రంగాల ప్రజలు వేలాది మందితో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. డప్పు దరువులకు కార్యకర్తలు నృత్యాలు చేశారు. టపాసులు కాలుస్తూ సందడి చేశారు. కెఎస్‌ను గెలిపించాలంటూ దారి పొడవునా నినాదాలతో హోరెత్తింది. మార్గ మధ్యలో పలు సంఘాల నాయకులు పూలు, మాలలతో స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలిస్తున్న అభ్యర్థి లక్ష్మణరావు తదితరులు
