ప్రజా సమస్యలపై మాట్లాడేది పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలే

Jan 19,2025 00:25

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఉద్యోగ, ఉపాధ్యాయ, చిరు ఉద్యోగులు, కార్మిక, కర్షకుల పక్షాన వారి వాణిని చట్టసభల్లో వినిపిస్తూ ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కెఎస్‌ లక్ష్మణరావును ఎమ్మెల్సీగా మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఉందని ప్రజాసంఘాల నాయకులు పిలులపు నిచ్చారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్‌ లక్ష్మణరావుకు మద్దతుగా నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా సహాధ్యక్షులు ఎ.భాగేశ్వరిదేవి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో 2.50 లక్షల మంది పట్టభద్ర ఓటర్లుండగా ప్రస్తుతం 3.46 లక్షల మంది నమోదయ్యారని చెప్పారు. నరసరావుపేట నియోజకవర్గంలో 9000 పట్టభద్రుల ఓట్లు 8 బూతుల పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నిక రాజకీయ, కుల, ధన బలమైన వర్గానికి, చైతన్యం కలిగిన పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి జరుగుతున్న ఎన్నికలుగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. పిడిఎఫ్‌కు ప్రజాబలం, కార్యకర్తల బలమే ఉందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. గత ఎన్నికల్లో ఓటు వేసే విధానంలో జరిగిన లోపాల వలన 5 వేలకు పైగా పిడిఎఫ్‌ అభ్యర్థికి చెందిన ఓట్లు చెల్లుబాటు కాలేదని, ఈ సారి ఆ సమస్య రాకుండా చూసుకుందామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలను కార్పొరేట్లు శాసిస్తున్నారని, వారిని నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఎమ్మెల్సీగా శాసన మండలిలో ప్రస్తావించిన ప్రజా సమస్యలు, పాల్గొన్న ప్రజా ఉద్యమాలను గుర్తు చేశారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ 58 వేల మంది పట్టభద్రులున్న పల్నాడు జిల్లాలో ఎక్కువ ఓట్లు పిడిఎఫ్‌ అభ్యర్థిగా దక్కేలా కృషి చేద్దామన్నారు. కౌలురైతులకు రుణాల కోసం, గుర్తింపు కార్డుల కోసం కెఎస్‌ లక్ష్మణరావు అనేక వేదికలపై మాట్లాడారని గుర్తు చేశారు. అనంతరం పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు, అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు కెపి.మెటిల్డాదేవి మాట్లాడారు. విద్యార్థి దశనుండే ఉద్యమ బాట పట్టిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించారని, నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి అని అన్నారు. రాజకీయ వేధింపులకు చిరుద్యోగులు గురైన అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్లతో, అధికారు లతో, చట్టసభలలో కూడా వారికి న్యాయం చేసేందుకు పోరాటం చేశారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల బాధ్యతల పట్ల, హక్కుల పట్ల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు సాధించిన ఫలితాలను నేడు ఆయా వర్గాలు అనుభవిస్తున్నాయని చెప్పారు. సమర్థత, సమస్యల పట్ల పరిష్కారానికి స్పష్టమైన అవగాహన కలిగిన లక్ష్మణరా వును గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో రోజుకో మాట, రోజు జీవో అమలు చేస్తూ ప్రభుత్వాలు అర్థం లేని విధంగా ఉపాధ్యాయులను పరుగులు పెట్టిస్తున్నా యని చట్టసభలలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల గురించి పట్టించుకునే వారే ఉండరని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గుంటూరు మల్లీశ్వరి, సాయి కుమారి, మాధవి, విజయలక్ష్మి, నిర్మల, కామినేని రామారావు, కోండ్రు ఆంజనేయు లు, కొత్తపల్లి హనుమంతరెడ్డి,టి.పెద్దిరాజు, మస్తాన్‌వలి, బోస్‌, కొమ్మల నాగేశ్వరరావు, సిలార్‌ మసూద్‌, సయ్యద్‌ రబ్బాని, ఉద్యోగ, ఉపాధ్యాయ, అంగన్వాడీ, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️