ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఉత్తమ పౌష్టికాహారం తీసుకోవడంతో వివిధ వ్యాధుల నుండి రక్షణే కాకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చునని ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శాంతకుమారి అన్నారు. ఆమె ఆదేశాల మేరకు స్థానిక ఐసిడిఎస్ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించి, ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 22 వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గర్భస్థ శిశువు నుంచి బిడ్డ పుట్టిన వెయ్యి రోజుల కాలవ్యవధి వరకు సంరక్షణ, ఈ సమయంలో గర్భిణి, శిశువు ఆరోగ్యంగా ఉండడానికి తగిన పౌష్టికాహారం, వైద్యపరీక్షలు, ఐరన్, కాల్షియం, అయోడిన్ సాల్ట్, విటమిన్లు, ఆకు కూరలు, కాయగూరలు, పాలు, గుడ్లు, ఎడబ్ల్యూసిలో ఇస్తున్న 5 రకాల బాలసంజీవినీ కిట్లు తీసుకోవాలన్నారు. రోజూ తినే ఆహారంలో తప్పనిసరిగా చిరుధాన్యాలు చేర్చుకోవాలని తెలిపారు. ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముర్రుపాలు గురించి, 6 నెలలు పాటు తప్పకుండా తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అలాగే అంగన్వాడీలకు పలు సలహాలు సూచనలు ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ.రాజు, సిడిపిఓ ఏ.గజలక్ష్మి, ఏపీవో అరుణకుమారి, ఏపిఎం ధనరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగలక్ష్మి, అరుంధతి, అంగన్వాడీలు, అధికసంఖ్యలో గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
