పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, సామగ్రి

May 12,2024 23:49

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరగనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి పంపిణీని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదివారం ప్రారంభించారు. జిల్లాలో ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ చేశామన్నారు. నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో 2 లక్షల 30 వేల 572 మంది ఓటర్లున్నారని, వీరు ఓటేయడానికి 245 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెపాపరు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 1929 పోలింగ్‌ కేంద్రాలున్నాయన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 10,800 మందిని బైండోవర్‌ చేశామని, ఇప్పటి వరకు రూ.5.09 కోట్ల నగదు, మద్యం, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటిల్లో ఆధారాలు చూపిన వాటిని తిరిగి ఇచ్చేస్తామన్నారు. పోలింగ్‌ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి పి.సరోజిని, నోడల్‌ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.
పోలింగ్‌ సరళిపై నిత్యం పరిశీలన..
పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అందులో వెబ్‌ కాస్టింగ్‌ మానిటరింగ్‌, డిస్టిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూము, కమ్యూనికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కంట్రోల్‌ రూమ్‌, మీడియా మానిటరింగ్‌ రూములు ఉన్నాయని జిల్లా ఎన్నికలాధికారి తెలిపారు.స్ట్రాంగ్‌ రూముల పరిశీలనపోలింగ్‌ అనంతరం ఇవిఎంలను భద్రపరిచేందుకు నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామ పంచాయతీ పరిధిలోగల జెఎన్‌టియు కళాశాలలో స్ట్రాంగ్‌ రూములను జిల్లా ఎన్నికలాధికారి శివశంకర్‌ ఆదివారం పరిశీలించారు. పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, ఈవీఎం బాక్స్‌లను సిసి కెమెరాల నిఘాలో భద్రపరచాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు స్ట్రాంగ్‌ రూములు పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ప్రవేశం నిషేధమన్నారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మెటీరియల్‌ మేనేజ్మెంట్‌ నోడల్‌ ఆఫీసర్‌ శ్రీదేవి పాల్గొన్నారు.

నీటికి కటకట.. కూర్చోలేక అవస్థ
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి పంపిణీ కేంద్రాన్ని గణపవరంలోని సిఆర్‌ కాలేజీలో ఏర్పాటు చేశారు. 2300 మంది పోలింగ్‌ సిబ్బంది రాగా అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. ఆరు టెంట్లు అవసరమైన చోట రెండు టెంట్లు వేశారు. వెయ్యిలోపే కుర్చీలు తెప్పించారు. తాగునీరు కూడా సరిగా సమకూర్చలేదు. ఐదారు వందల బాటిల్స్‌ మాత్రమే తీసుకొచ్చారు. వాటిని కూడా భోజన సమయంలోనే ఇచ్చారు.మహిళా సిబ్బందికి మరుగుదొడ్ల వసతి కూడా ఏర్పాటు చేయలేదని వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కూర్చోవడానికి కుర్చీలైనా లేకపోవడంతో చాలా మంది చెట్ల కింద, డ్రెయినేజీ కాల్వ అరుగుల మీద కూర్చోవాల్సి వచ్చింది.
ప్రజాశక్తి-మాచర్ల : మాచర్ల నియోజకవర్గంలోని 299 పోలింగ్‌ కేంద్రాలకు డిస్టిబ్యూషన్‌ కేంద్రాల నుండి పోలింగ్‌ అధికారులు ఈవీఎం బాక్స్‌లతో ఆదివారం తరలివెళ్లారు. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆదివారం ఉదయానికే చేరుకున్న అధికారులు తమ తమ పోలింగ్‌ కేంద్రాలకు సంబధించిన ఎన్నికల ఈవీఎంలతో పాటు మెటీరియల్‌ తీసుకొని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లో ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. మాచర్ల నియోకవర్గంలో మొత్తం 28 సెక్టార్లు, 28 రూట్లుగా విభజించారు. సుమారు 2 వేల మంది అధికారులు సిబ్బంది ఈ ఎన్నికల్లో విధినిర్వహణలో పాల్గొంటున్నట్లు మాచర్ల ఆర్వో శ్యాంప్రసాద్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రలో ఏర్పాట్లను, డిస్టిబ్యూషన్‌ను ఆయన దగ్గరవుండి పరిశీలించారు.

రక్షణ వలయంలో మాచర్ల నియోజకవర్గం
రాష్ట్రంలో అతి సమస్యాత్మక నియోజకవర్గం కావటంతో మాచర్లలో పోలీస్‌ బలగాలతో అత్యంత పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు గురజాల డీఎస్పీ పల్లంరాజు తెలిపారు. రాష్ట్రస్థాయి అధికారులు కూడా ఈ నియోజకవర్గంలో పర్యవేక్షణకు వచ్చారన్నారు. ఐజి శ్రీకాంత్‌, ఎస్పీ సుప్రజ, ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సిఐలతోపాటు మరికొంతమంది రానున్నారని తెలిపారు. 20 మంది ఎస్సైలు, 300కు పైగా హెడ్‌ కానిస్టేబుల్స్‌, పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 4 కంపెనీలు (400 మంది) సెంట్రల్‌ ఆర్మడ్‌ పోలీస్‌ ఫోర్స్‌, వీరుకాక తమిళనాడు నుంచి మరికొంత సిబ్బంది వస్తున్నారని, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అనవసరమైన వివాదాల్లో పాల్గొని, కేసుల్లో ఇరుక్కోని జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
ప్రజాశక్తి – పెదకూరపాడు : ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పెదకూరపాడు నియోజకవర్గ ఈఆర్‌ఓ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బారికేడ్లు, షామియానాలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, ఇతర వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఉదయాన్నే ఐదున్నరకు మాక్‌ పోలింగ్‌ జరుగుతుందని, 7 గంటల నుండి జనరల్‌ ఓటింగ్‌ మొదలవుతుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా మహిళలకు పురుషులకు ఒకే క్యూ లైన్‌ ఏర్పాటు చేయటం విమర్శలకు తావిస్తోంది. గత ఎన్నికల్లో మహిళలకు ఒక వరుస, పురుషులకు ఒక వరుస ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బారికేడ్లు ఏర్పాటు చేసి ఒకేలైను ఏర్పాటు చేశారు.

➡️