సాయిసాధన చిట్స్‌ ఎండి పుల్లారావును కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌

  • స్థిరాస్తుల అటాచ్మెంటుకు రంగం సిద్ధం…

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆర్థిక నేరాలకు పాల్పడిన సాయిసాధన చిట్స్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పాలడుగు పుల్లారావును విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్‌ బఅందం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పుల్లారావుకు చెందిన సంస్థలకు సంబంధించిన బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసింది. త్వరలోనే ఆయన ఆస్తులను అటాచ్‌ చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అటాచ్మెంట్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం పుల్లారావు కుటుంబ సభ్యులు, ఇతరులతో భాగస్వామ్యం ఉన్న ఆస్తులను కూడా అటాచ్‌ చేయనున్నట్లు దీనికి సంబంధించి బాధితుల సంఘం కమిటీ కఅషి చేస్తున్నట్లు సమాచారం. మొట్ట మొదట పుల్లారావు అజ్ఞాతంలోకి వెళ్ళడానికి ముందు కొందరికి రిజిస్ట్రేషన్‌ చేసిన స్థిరాస్తుల మ్యుటేషన్‌ ను, ఆయా ఆస్తుల వివరాలను కూడా సిట్‌ బృందం స్తంభింపచేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. కాగా పుల్లారావు గుంటూరు జిల్లా కోర్టులో రిమాండ్‌ లో ఉన్న విషయం తెలిసిందే.

వంద కోట్ల రూపాయల మేర అప్పుల ఎగవేత కేసులో పల్నాడు జిల్లానరసరావుపేటకు చెందిన సాయి సాధన చిట్ ఫండ్ అధినేత పాలడుగు పుల్లారావును పోలీసులు నరసరావుపేటలోని 13వ అదనపు జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇటీవలే గుంటూరు జిల్లా కోర్టులో లొంగిపోయిన పుల్లారావును పోలీసులు నరసరావుపేట తీసుకొచ్చారు. న్యాయస్థానం ఈనెల 21 వరకూ రిమాండ్ విధించడంతో తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. చిట్‌ఫండ్‌ వ్యాపారం ముసుగులో చందాలు కట్టించుకున్న పుల్లారావు కొన్ని నెలలుగా చెల్లింపులు చేయడం లేదు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయగా ఇతని బాగోతమంతా బట్టబయలైంది.

బాధితుల ఆందోళన: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయిసాధనా చిట్ ఫండ్స్ బాధితులు రోడ్డెక్కారు. కమ్మ వసతి గృహంలో బాధితులంతా సమావేశమై తమకు రావాల్సిన బకాయిల గురించి చర్చించుకున్నారు. సాయిసాధనా చిట్ ఫండ్స్ ఎండీ పాలడుగు పుల్లారావు తమకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చిట్ కు చెల్లించిన నగదు రసీదులతో వందమందికి పైగా బాధితులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేకూరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దాదాపు రూ 350 కోట్ల వరకు ప్రజా ధనాన్ని సాయి సాధన చిట్స్ అధినేత పుల్లారావు ఎగవేశారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

➡️